వారితో కేటీఆర్ దోస్తీ వెనుక కారణం ఏంటీ..?

Update: 2018-12-01 08:39 GMT

రాహుల్ గాంధీ కుటుంబానిది త్యాగాల కుటుంబమైతే... కేసీఆర్ కుటుంబ చరిత్ర దోపిడీ చరిత్ర అని మాజీ ఎంపీ మధు యాష్కి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ది మొదటినుంచీ దోపిడీ చరిత్రే అని పేర్కొన్నారు. చింతమడక స్కూల్ లో ఉన్నప్పుడే బీడీలు తాగేందుకు కేసీఆర్ గ్యాస్ స్టవ్ అమ్ముకున్నారని ఆరోపించారు. తర్వాత దుబాయ్ శేఖర్ గా, శేఖర్ మామగా ఎదిగారని, మొదటి ఎన్నికల్లో గెలిచినప్పుడు కేసీఆర్ పైన ఉన్న దొంగ నోట్ల కేసు ఇప్పటికీ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ దయతో కేంద్రమంత్రిగా ఎదిగిన తర్వాత అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 2009లో కేటీఆర్ ఆస్తి రూ.1.13 కోట్లని, 2014లో రూ.7.98 కోట్లకు పెరిగిందని, 2018కి ఏకంగా 424 శాతం పెరిగి రూ.41 కోట్లకు చేరిందన్నారు.

బెదిరించి డబ్బులు వసూలు చేశారు...

తెలంగాణ ఉద్యమ సమయంలో ఓవైపు యువకులు త్యాగాలు చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రం ఆంధ్రా పారిశ్రామికవేత్తలను, ప్రొడ్యూసర్లను బెదిరించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. సత్యం స్కాం రామలింగరాజు కుమారుడు తేజారాజు ఎటువంటి వ్యాపారాలు చేయకుండా నిషేదం ఉందని, అయినా కేటీఆర్ ఆయనను ప్రభుత్వ ఖర్చుతో మలేషియా ప్రధాని వద్దకు తీసుకెళ్లారన్నారు. తేజారాజు భార్య స్థాపించిన సంస్థతో కేటీఆర్ వాటాలు ఉన్నాయని, ఇక్కడ వచ్చిన కమీషన్ల డబ్బులను కేటీఆర్ సింగపూర్, మలేషియాలకు మళ్లించి అక్కడి నుంచి తన బినామీ సంస్థల్లోకి మళ్లీ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. బాత్ రూం కూడా బుల్లెట్ ప్రూఫ్ తో కట్టించుకున్న కేసీఆర్... దేశం కోసం త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

Similar News