టిక్..టిక్...టిక్...టిక్....!

Update: 2018-09-06 03:52 GMT

ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు 2014 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే సీఎంగా కేసీఆర్ నాలుగేళ్ల మూడు నెలల నాలుగు రోజులు పరిపాలన చేసినట్లయింది. ఈ నాలుగేళ్ల మూడునెలల పాలనలో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల సంఖ్యను 31కి పెంచారు. తద్వారా ప్రజల చెంతకు పరిపాలనను తీసుకెళ్లగలిగారు. ఇక మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగేళ్లలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తప్పించి కడియం శ్రీహరిని మంత్రివర్గంలో చేర్చుకోవడం మినహా మార్పులేమీ చేయలేదు. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాసయాదవ్, తుమ్మల నాగేశ్వరరావులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

మాజీలుగా ఎమ్మెల్యేలు.......

మంత్రివర్గాన్ని రద్దు చేస్తే కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఎమ్మెల్యేలు అందరూ మాజీలుగానే మారతారు. గవర్నర్ కు రద్దు తీర్మానం అంద చేసిన వెంటనే కేసీఆర్ ను గవర్నర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరతారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అత్యవసరం అనిపిస్తే తప్ప గవర్నర్ మంత్రిమండలి తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉండదు. అసెంబ్లీ రద్దయితే డిసెంబరులో ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ రేపటి నుంచే హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు.

Similar News