పవన్ కల్యాణ్ ఫిక్స్ అయినట్లే ఉందిగా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పది గంటల దీక్ష చేశారు. అయితే ఈ దీక్ష సందర్భంగా రెండు అంశాలు స్పష్టంగా తెలిశాయి.

Update: 2021-12-13 02:16 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పది గంటల దీక్ష చేశారు. అయితే ఈ దీక్ష సందర్భంగా రెండు అంశాలు స్పష్టంగా తెలిశాయి. ఒకటి వైసీపీతో వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడం. రెండోది టీడీపీకి సానుకూలంగా ఉన్నానని పరోక్షంగా చెప్పడం. చాలా రోజుల నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కింది స్థాయిలో రెండు పార్టీల నేతలు పొత్తు పెట్టుకున్నారు. వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో కలసి వెళ్లడమే మంచిదని డిసైడ్ అయ్యారు పవన్ కల్యాణ్.

డెడ్ లైన్ లు పెట్టకుండానే...
అందులో భాగంగానే తొలుత తాను పార్టీని పటిష్టం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కన్పించింది. వైసీపీ మూడు రాజధానుల అంశంతో దెబ్బతింటామని భావించిన పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో దీక్ష చేశారు. ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అని చెప్పారు. అఖిలపక్షం కోసం డిమాండ్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఎటువంటి డెడ్ లైన్ లు పెట్టకుండానే ముగించారు. రాయలసీమ కోసం రైతు సదస్సులను నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ దీక్ష విరమణ సమయంలో ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వంపై....
ఇక వైసీపీ ఉంటే రాష్ట్రం బాగుపడదని పవన్ కల్యాణ్ పదే పదే చెప్పారు. సినిమా టిక్కెట్ల నుంచి మద్యం ధరల వరకూ అంతా దోపిడీయేనని చెప్పారు. వైసీపీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించితేనే రాష్ట్రానికి మంచి రోజులని చెప్పారు. మరోవైపు తనకు కులం, మతం అంటూ ఏమీ లేవన్నారు. వైసీపీ ఒక కులాన్ని టార్గెట్ చేసిందని పరోక్షంగా కమ్మ సామాజికవర్గానికి పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అసెంబ్లీలో జరిగిన అన్యాయాన్ని కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
మూడు పార్టీలు కలసి...
ఏతా వాతా తేలిందేంటంటే.... పవన్ కల్యాణ్ రెండు పార్టీలతో కలసి ముందుకు వెళ్లాలన్న భావనతో ఉన్నట్లు కన్పించింది. అటు మోదీ, అమిత్ షాలను పొగుడుతూనే, చంద్రబాబు ప్రస్తావన లేకుండానే పరోక్ష మద్దతు తెలపడంతో ఈసారి జనసేన, బీజేపీ, టీడీపీ లు కలసి వెళ్లే అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పారు. కానీ మూడు నెలలకొకసారి మేకప్ తీసి జనం ముందుకు వచ్చే పవన్ కల్యాణ్ ఏ మేరకు ఈసారి ఎన్నికల్లో సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News