అమెరికాలో చరిత్ర సృష్టించనున్న తెలుగు మహిళ..?

Update: 2018-06-26 07:28 GMT

అమెరికాలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో కాంగ్రెస్ లో అడుగుపెట్టేందుకు ఆమె ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమంటోంది అమెరికన్ మీడియా. కృష్ణా జిల్లాకు చెందిన కాట్రగడ్డ వెంకట రామారావు 1972లో ఐబీఎంలో ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. అప్పటికి తన కూతురు అరుణ వయస్సు ఏడేళ్లు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన అరుణ.. మిస్సోరి యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసింది. కాలేజీలో తన తోటి విద్యార్థి డేవిడ్ మిల్లర్ ను 1990లో వివాహం చేసుకుంది.

గెలుపు సులువే...

అమెరికాలోనే స్థిరపడిన అరుణ దంపతులు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2004లో అరుణ మిల్లర్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్థుతం కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిక్త్స్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ నుంచి ఆమె ప్రతినిధుల పభకు పోటీ చేస్తున్నారు. ఈ స్థానం డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట. దీంతో ఆమె విజయం నల్లెరు మీద నడకే అంటున్నాయి పలు సర్వేలు. ఆమెకు ప్రత్యర్థిగా వ్యాపార వేత్తగా, ధనవంతుడు ట్రోన్ పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆయన రూ.65 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా, అరుణ మిల్లర్ మాత్రం రూ.9 కోట్లే ఖర్చు చేస్తోంది. ఈ ఎన్నికల్లో అరుణ గెలిస్తే అమెరికన్ కాంగ్రెస్ లో అడుగుపెట్టనున్న రెండో మహిళగా చరిత్రకెక్కనుంది.

Similar News