ఈ దొంగల బంధం మామూలిది కాదు

Update: 2018-06-26 11:46 GMT

దోచుకోవడం...దాచుకోవడమే ఆ కుటుంబం వృత్తి. ఒకరూ ఇద్దరు కాదు కుటుంబంలోని మొత్తం 12 మందికీ దొంగతనాలే పని. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేయడం, ఆ సొమ్మును దాచుకోవడం. మూడు కమిషనరేట్ల పోలీసులను ముప్పుతిప్పిలు పెట్టిన ఈ దొంగలముఠా ఒక చిన్న క్లూతో దొరికిపోయారు. పోలీసుల విచారణలో ఈ దోపిడీ ముఠా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రైం స్టోరీలో ప్రధాన నిందితులు సద్దాం అలీ, పోతరాజు.. వీరిద్దరు చిన్న తనంలో చోరీలు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లలో అరెస్టై జువెనైల్ హోంలో కలిశారు. అక్కడే వీరి పరిచయం స్నేహంగా మారి ఓ పెద్ద ముఠా ఏర్పాటుకు దారితీసింది. ఈ ఇద్దరు కలిసి ఏర్పరుచుకున్న ముఠాలో బయట వ్యక్తులు ఉంటే ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయని, ఏకంగా తమ కుటుంబ సభ్యులనే కలుపుకున్నారు.

దొంగతనం చేసి ఆస్తులు కొన్నారు...

తల్లి..చెల్లి.. అన్న.. తమ్ముడు ఇలా అందరూ కలిసి ఉదయం కాలనీల్లో రెక్కీ చేయడం ఆ తరువాత తాళం వేసి ఉన్న ఇళ్లను దోచేయడం మొదలుపెట్టారు. ఈ ముఠా ఎంపిక చేసే ఇళ్లు, కాలనీలలో ఉన్న సిసి కెమేరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తారు. ఆ తరువాత వాటి వైర్లు కట్ చేసి చోరీ చేస్తారు. ఇలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి మొత్తం 34 ఇళ్లను కొల్లగొట్టారు. అయితే ఇటీవల ఒయూ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో పోలీసులకు ఓ చిన్న వేలి ముద్ర లభించింది. అదే ఈ ముఠాను అరెస్టు చేయడానికి కారణమైంది. అక్కడ దొరికిన వేలి ముద్రను సేకరించిన పోలీసులు పాత ఫైళ్లు తిరగేస్తే సద్దాం అలీదిగా తెలిసింది. అంతే మొత్తం ఫ్యామిలీ ముఠా ఊచలు లెక్కబెడుతోంది. ఈ ముఠా నుండి రెండు కోట్ల రూపాయల విలువ చేసే అయిదు కిలోల బంగారం, 13 కిలోల వెండీ, ఎనిమిది లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు దోచుకున్న సొత్తుతో కొనుగోలు చేసిన ఫ్లాట్స్ లను సీజ్ చేసిన పోలీసులు వాటి డాక్యూమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.

Similar News