హైదరాబాద్ లో హై అలర్ట్

Update: 2018-07-21 11:10 GMT

హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పోలీసులు తనిఖీలతో హోరెత్తిస్తున్నారు.. పగలు రాత్రి తేడా లేకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. కాస్త అనుమానంగా ఎవరైనా కనపడితే చాలు వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక్కరోజులోనే పది ప్రాంతాల్లో డీసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. పండగల సీజన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కనుకు కరువవుతోంది. రంజాన్ ఆ తరువాత బోనాలు, వినాయకచవితి, బక్రీద్ ఇలా 24 గంటలు డ్యూటీకే పరిమితం కావాల్సి వస్తుంది. ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా పై స్థాయి అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు నిత్యం శ్రమిస్తుంటారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న హైదరాబాద్ పోలీసులకే పండుగలు పెద్ద సవాల్ గా మారుతాయి.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు

తాజాగా తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొనే ఆషాడమాసం బోనాల్లో పోలీసులు బందోబస్తులో తలమునకలౌతున్నారు. గోల్కొండ కోట నుండి మొదలుకొని సికింద్రాబాద్ ఉజ్జయనీ మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు, తిరిగి గోల్కొండ బోనాలతో పండుగ ముగుస్తుంది. ఇది కాస్త పూర్తయిందని అనుకునే లోపు వినాయక చవితి, బక్రీద్ వచ్చి చేరుతాయి. దీంతో పోలీసులు సిటీలో హై అలర్ట్ ప్రకటించారు. పగలు రాత్రి తేడా లేకుండా సోదాలతో హోరెత్తిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే మాదాపూర్, మేడిపల్లి, గోషామహల్, చందానగర్ ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. వందల సంఖ్యల్లో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరంతా ఎక్కడి వారు, సిటీకి ఎందుకు వచ్చారు.. ఎవైనా నేరాలతో లింక్ ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇక సిటీలోని సికంద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ లోని అక్కన్నమాదన్న ఆలయం, సింహవాహిని దేవాలయాలతో పాటు మిగతా ఆలయాల కమటీలు, జీహెచ్ ఎంసి, ట్రాన్స్ కో, ఫైర్ డిపార్టుమెంట్ అందరితో కలిసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఏ ఒక్క ఘటన కూడా చోటు చేసుకోవద్దని, పోలీసులంటే జనంలో భరోసా కలగాలన్నదే తమ ఉద్దేశ్యం అంటున్నారు పై అధికారులు. ముఖ్యంగా బోనాల నేపథ్యంలో ప్రతి దేవాలయం వద్ద షీ టీమ్స్ ని రంగంలోకి దింపుతున్నారు. మొత్తానికి పోలీసులు మాత్రం ఈసారి బందోబస్తును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనే చెప్పాలి.

Similar News