గజానికో కారు మార్చి పరారయ్యారే.....!

Update: 2018-07-29 12:22 GMT

ఫేక్ కరెన్సీ ముఠా కేసులో సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు స్పీడందుకుంది. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను దారిమళ్లించేందుకు దుండగులు గజానికో కారును మార్చి.... మార్చి మరీ సినీ ఫక్కీలో పరారైనట్లు గుర్తించారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సైబరాబాద్ తో పాటు హైదరాబాద్ పోలీసుల సహకారంతో విచారణలో వేగం పెంచారు.

వరుస సంఘటనలతో.....

సైబరాబాద్ పోలీసులకు కంటిమీద కనుకు కరువైంది. గత పదిరోజులుగా వరుసగా ఎదురైన సంఘటనలు అధికారులకు మింగుడు పడని వ్యవహారమైంది. ఒకపక్కన జనాల నెత్తిన కోట్ల రూపాయల టోపీ పెట్టిన కరక్కాయ దుండగుల కోసం గాలిస్తూనే మరోపక్కన అవుటర్ రింగ్ రోడ్డులో పరుగులుపెట్టించిన ఫేక్ కరెన్సీ ముఠా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపులు మరింత ముమ్మరం చేశారు. ఈకేసులో కొన్ని ఆధారాలు సేకిరంచిన పోలీసులు వీలైనంత త్వరగా దుండగులను అదుపులోకి తీసుకోవాలని కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

కరక్కాయ నిందితుల కోసం.....

కరక్కాయ నిందితుల కోసం సిసిఎస్ పోలీసులు గాలిస్తుండగా, ఫేక్ కరెన్సీ ముఠా కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఒటి పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ నోట్ల ముఠా విషయంలో పోలీసులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నారు. పాతబస్తీకి చెందిన జాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో రఫిక్, ఆటోడ్రైవర్ యూనస్ కోసం గాలిస్తున్నారు. వారికి సంబంధించిన సెల్ ఫోన్ వివరాలు సేకరిస్తున్నారు. తన వద్ద ఉన్న 30వేల యుఎస్ డాలర్లు మార్చే క్రమంలో ఆటోడ్రైవర్ యూనస్ పరిచయమయ్యాడని, తన స్నేహితుడు రఫిక్ డాలర్లు తీసుకొని నోట్లు అందిస్తానని చెప్పడంతో తాను నమ్మి డాలర్స్ ఇచ్చానని చెప్పాడు. ఇదంతా ఇలా ఉంటే సిటీలో ఈ తరహా ముఠాలు చాలా తిష్టవేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పాతబస్తీకి చెందిన.....

నిందితులు రఫిక్, యూనస్ పాతబస్తీకి చెందిన వారు కావడంతో సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. అప్పాజంక్షన్ వద్ద నకిలీ నోట్లు అందించి వారు విజయవాడ వైపు పారిపోయినట్లు అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న సిసి కెమేరాలు స్పష్టం చేశారు. ఈ కేసులో కాస్త అడుగు ముందుకు వేసిన పోలీసులు నిందితులకు సంబంధించిన మూడు కార్లను స్వాదీనం చేసుకున్నారు. దుండగులు సినీ ఫక్కీలో గజానికో కారును మార్చుతూ పోలీసులను దారి తప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

చాలా మందిని....

జాఫర్ తరహాలో దుండగులు చాలా మందిని దోచుకున్నట్లు విచారణలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. దుండగులకు కార్లు అందించిన వాటి యజమానులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎలాగైనా వారిని పట్టుకుంటే సిటీలో ఫేక్ కరెన్సీ ముఠా పెద్దఎత్తున పట్టుబడే అవకాశం ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో సైబరాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు సైతం పోటీ పడుతున్నట్లు సమాచారం.

Similar News