బాబు గోగినేని బ‌య‌ట‌కు రావాల్సిందేనా..?

Update: 2018-07-19 08:38 GMT

దేశ‌ద్రోహం, కులమ‌తాల పేరుతో ప్ర‌జ‌ల్లో విద్వేశాలు రెచ్చ‌గొడుతున్నార‌ని అభియోగాలు ఎదుర్కొంటున్న హేతువాది బాబు గోగినేనికి ఇబ్బందులు త‌ప్పేలా లేవు. బాబు గోగినేనిపై న‌మోదైన కేసులో చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ వీర‌నారాయ‌ణ నే వ్య‌క్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 25వ తేదీ లోపు బాబు గోగినేని కేసులో పురోగ‌తిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ హైకోర్టు పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసు విచార‌ణ ప్రారంభించాల‌ని మాదాపూర్ పోలీసులు భావిస్తున్నారు. నేడో రేపు ఆయ‌న‌కు నోటీసులు అంద‌జేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌కు నోటీసులు

ప్ర‌స్తుతం బాబు గోగినేని బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నందున బిగ్ బాస్ నిర్వ‌హాకుల‌కు నోటీసులు అందించ‌నున్నారు. బాబు గోగినేనిపై దేశద్రోహం, మతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో ద్వేష భావనలు రెచ్చ‌గొట్ట‌డం, నేరపూరితమైన నమ్మక ద్రోహం, మోసం, దురుద్దేశంతో శాంతిని భగ్నపరచడం, వర్గాల నడుమ శత్రు భావనలు పెంపోందించ‌డం, మత విశ్వాసాలను అవమానించడం, అనుచిత ప్రచారంతో పాటు ఆధార్ చట్టంలోని పలు సెక్షన్ల కింద‌ కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు, న‌మోదైన సెక్ష‌న్ల‌ను బ‌ట్టి చూస్తే బాబు గోగినేనికి ఈ కేసులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

Similar News