ఎన్టీఆర్ పేరు మార్పుపై మనసు మార్చుకున్న జగన్

ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనిర్సిటీకి తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఇప్పటికీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది

Update: 2022-09-27 08:21 GMT

ఎన్టీఆర్ పేరు విషయంలో రగడ ఆగడం లేదు. అన్ని వర్గాల నుంచి కొంత వ్యతిరేకత మొదలయింది. ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనిర్సిటీకి తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఇప్పటికీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. అందుకే నష్ట నివారణ చర్యలకు దిగేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటీకి కొనసాగిస్తూనే ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఎన్టీఆర్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయానికి విరుగుడు అని జగన్ సయితం భావిస్తున్నారు.

అభ్యంతరాలు వ్యక్తం కావడంతో...
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఉన్న ఎన్టీఆర్ పేరు తొలగించడంపై అభ్యంతరాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తప్పుకున్నారు. ఎన్టీఆర్ అంటే అన్ని వర్గాల్లో ఒకరకమైన అభిమానం ఉంది. ఆ పేరును తొలగించడంపై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత కనపడుతుంది. సొంత పార్టీ నేతల్లోనూ ఈ విషయంపై చర్చ జరుగుతుంది. అధినాయకత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని వైసీపీ నేతలు సయితం భావిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్టీఆర్ పేరు తొలగింపు ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని పార్టీ హైకమాండ్ కు కూడా అనుమానం వచ్చింది.
రాజకీయంగానే కాక...
దీంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ పేరు మార్పును వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయ పార్టీలను అంటే జగన్ లెక్క చేయరు. కానీ ప్రజల్లో ఒకరకమైన భావన ఏర్పడింది. చనిపోయిన వారి పేర్లను తొలగించడం ఏంటన్న ప్రశ్న కొందరి నుంచి ఎదురవుతుంది. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అవే చెబుతున్నాయి. ఎన్టీఆర్ ఒక సామాజికవర్గానికి చెందిన నేత కాదు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని ఇప్పటికీ నమ్ముతారు. వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు పై జగన్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఎన్టీఆర్ పేరు మార్పుతో కొంత శాతాన్నైనా కోల్పోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే జగన్ కొత్త ఆలోచనను అమలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
భారతరత్న ఇవ్వాలని....
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపాలని నిర్ణయించారు. ఒకవేళ ఎన్టీఆర్ భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా దానిని అందుకునేది ఆయన భార్య లక్ష్మీ పార్వతి. అందుకే కేంద్రంలోని పెద్దలపై వత్తిడి తెచ్చి భారతరత్నను ఎన్టీఆర్ కు ఇప్పించాలన్న పట్టుదలతో జగన్ ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టినట్లవుతుంది. అంతేకాదు శాశ్వతంగా జగన్ పేరు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ నిలిచిపోతుంది. హెల్త్ వర్సిటీ పేరు మార్పు కూడా కనుమరుగవుతుంది. తమపై విమర్శలు చేసే బీజేపీ నేతలకు కూడా చెక్ పెట్టవచ్చు. అందుకే ఎన్టీఆర్ కు భారతరత్నను ఇవ్వాలన్న డిమాండ్ వైసీపీ నుంచి త్వరలో వినపడనుంది.


Tags:    

Similar News