సంక్షేమానికే ప్రయారిటీ.. హరీశ్ పద్దులు ఇవే

తెలంగాణ ప్రభుత్వం 2023-24 బడ్జెట్ లో సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది

Update: 2023-02-06 06:02 GMT

తెలంగాణ ప్రభుత్వం 2023-24 బడ్జెట్ లో సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రధానంగా దళితబంధు పథకం కోసం 17,700 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. ఈ పథకం కింద 119 నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఎంపిక చేసిన వారికి కొందరికి దళితబంధు పథకాన్ని అందచేయనున్నారు. వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలకు కూడా అత్యధికంగా కేటాయింపులు జరిపింది. రైతు ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.

అర్హులైన వారందరికీ...
తెలంగాణలో 57 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లను అందచేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. 2022లో కొత్తగా 8,96,592 మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నామని, ఇందుకోసం 12,000 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇక పేదలకు అందించే రేషన్ బియ్యంపై గత ప్రభుత్వం విధించిన పరిమితులను తాము ఎత్తివేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు కేజీల బియ్యాన్ని ఉచితంగా అందచేస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించామని, ఈ బడ్జెట్ లో వాటికి కేటాయింపులు జరిపామని హరీశ్ రావు తెలిపారు.
నాణ్యమైన విద్యుత్తును...
నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అన్ని రంగాలకూ అందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్తును అందచేస్తున్నామని చెప్పారు. 7778 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 18,453 మెగావాట్ల ఉత్పత్తికి పెంచడం జరిగిందన్నారు. భద్రాద్రిలో 1080 మెగావాట్లు, కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్ లో 800 మెగావాట్లు, మంచిర్యాల జిల్లా జైపూర్ లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమయిందని హరీశ్‌రావు తెలిపారు. ఇంకా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్న విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈబడ్జెట్ లో విద్యుత్తు శాఖ కోసం 12,727 కోట్లను కేటాయించామని చెప్పారు.
నీటి పారుదల రంగానికి...
తమ ప్రభుత్వం నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1200 చెక్‌డ్యామ్ లను నిర్మిస్తుందని, ఇందుకోసం 3,825 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. తెలంగాణలో కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని హరీశ్ రావు వెల్లడించారు.

కేటాయింపులివే...

వ్యవసాయానికి రూ. 26,931 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు
విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు
దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.6229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు




Tags:    

Similar News