‘సహకారం’పై కేంద్రం దిగి రాక తప్పదా?

Update: 2016-11-18 23:39 GMT

అందరికీ ఒక రకం నిబంధనలు, సహకార బ్యాంకులకు మరో రకం నిబంధనలు అనుసరిస్తూ... సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్లతో నగదు డిపాజిట్లకు అనుమతించకుండా.. కేంద్రప్రభుత్వం విధించిన ఆంక్షలు సర్వత్రా విమర్శలకు గురవుతున్నాయి. నగరాల్లో కాకుండా, చిన్న పట్టణాలు, ప్రధానంగా గ్రామాల్లో సహకార బ్యాంకుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో రైతులు వ్యవసాయ సహకార బ్యాంకుల్లో చేసుకునే నగదు డిపాజిట్లు అసలు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి రానే రావు. ఇలాంటి నేపథ్యంలో.. వీటిపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. అయితే డిపాజిట్లను కూడా అనుమతించకపోవడం అనేది కరెక్టు కాదని, రైతులు ఆయా సహకార రంగాల్లోని సామాన్యులకు ఇది అశనిపాత నిర్ణయమని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చివరికి ఈ విషయంలో నిర్ణయంపై కేంద్రం ఒక మెట్టు దిగవలసి వచ్చేలా ఉంది.

సహకార రంగంలో బ్యాంకుల్లో డిపాజిట్లపై ఆంక్షలు పెట్టడంతో ఆ బ్యాంకుల ఉద్యోగులు కూడా ధర్నాలు నిర్వహించారు. అయితే ఇక్కడ చిన్న మతలబు కూడా ఉంది. రైతుల పేరిట ఇక్కడ డిపాజిట్ అయ్యే నగదుకు పన్ను లేకపోవడంతో.. నల్లకుబేరులు చాలా మంది.. సహకార బ్యాంకు ఉద్యోగుల సహకారంతో రైతుల అకౌంట్లలో డబ్బు వేసుకుంటూ.. అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంది.

అయితే కొందరు అక్రమాలు చేస్తున్నారు గనుక, వాటికి అడ్డుకట్ట వేసే వ్యవస్థ లేక, మొత్తం ఆ రంగంలోని రైతులు, సామాన్యులు అందరికీ ఇబ్బంది అయ్యేలా నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విషయం డిమాండ్ చేస్తున్నారు.

ట్విస్టు ఏంటంటే.. ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయిన ఏపీ సీఎం చంద్రబాబు ది ఇదే డిమాండు. ఎన్డీయే కు అంశాల వారీ మద్దతు అన్నట్లు వ్యవహరించే తెలంగాణ సీఎం కేసీఆర్ ది ఇదే డిమాండు. ఎన్డీయేతర విపక్షం పాలనలో ఉన్న కేరళ సీఎం పిసరయి విజయన్ ది కూడా ఇదే డిమాండు. ఆయనైతే ఏకంగా ఆర్బీఐ ఎదుట ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి స్వయంగా ధర్నాకు దిగడం విశేషం. సహకార వ్యవస్థ దేశ ఆర్థిక రంగానికి వెన్నెముక వంటిదని, దాన్ని నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకోవడం తగదని వీరంతా వాదిస్తున్నారు. ఇదే విషయంపై మోదీని కలవడానికి సీఎం కేసీఆర్ దిల్లీలో ఉన్నారు. పిసరయి విజయన్, చంద్రబాబు తరఫున వారి పార్టీల ఎంపీలు మోదీకి ఈ మేరకు విన్నవించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సహకార రంగం విషయంలో డిపాజిట్లకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేలా ఉందని పలువురు భావిస్తున్నారు.

Similar News