అడవిలో నుండి వచ్చి సైకిల్ పై వెళుతున్న వ్యక్తిపై దాడి చేసిన చిరుత

ఈ వీడియోను IFS అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Update: 2022-06-16 14:22 GMT

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ గుండా వెళుతున్న సైక్లిస్ట్‌పై చిరుత దాడి చేసింది. ఈ షాకింగ్ సంఘటన కెమెరాలో రికార్డు అయింది. విస్తృతంగా షేర్ చేయబడిన ఫుటేజీలో సైక్లిస్ట్ కాజిరంగాలోని జాతీయ రహదారిపై వెళుతుండగా చిరుతపులి అతనిపైకి దూకేసింది. అడవిలో నుండి ఒక్కసారిగా ఆ చిరుత బయటకు వచ్చింది. ఆ సైక్లిస్ట్‌ని తన ఆహారంగా భావించి, అతని ఎడమ కాలిపై దాడి చేసింది. అయితే సైక్లిస్ట్‌ బ్యాలెన్స్‌ తప్పి కిందపడటంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర సైక్లిస్టులు, కార్లు ఆ దాడిని చూసిన తర్వాత కొద్దిసేపు ఆగిపోయాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తి గాయపడలేదు. అతను వెంటనే లేచి సైకిల్‌ను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు.

ఈ వీడియోను IFS అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. జనవరిలో ఈ దాడి జరిగిందని, పార్క్ అధికారులు కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలలో ఈ ఘటన బంధించబడిందని చెప్పుకొచ్చారు. చిరుతపులులు పరిస్థితులకు, ప్రాంతాలకు వీలైనంత తొందరగా అలవాటు పడతాయని కస్వాన్ చెప్పుకొచ్చారు. చిరుత పులులు వ్యవసాయ భూములు, చెరకు తోటలు, తేయాకు తోటలు.. నగరాలకు దగ్గరగా కొండలు మరియు అడవులలో కూడా నివసిస్తాయి.




Tags:    

Similar News