ఆమెకు నమ్మిన బంటేనా?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వెనక శశికళ ఉన్నారా? ఆమె చెప్పినట్లే పళనిస్వామి పాలన సాగిస్తున్నారా? చిన్నమ్మ సూచనలు, సలహాలు పళనిస్వామి తీసుకుంటున్నారా? అన్న చర్చ అన్నాడీఎంకేలో జోరుగా [more]

Update: 2019-11-03 17:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వెనక శశికళ ఉన్నారా? ఆమె చెప్పినట్లే పళనిస్వామి పాలన సాగిస్తున్నారా? చిన్నమ్మ సూచనలు, సలహాలు పళనిస్వామి తీసుకుంటున్నారా? అన్న చర్చ అన్నాడీఎంకేలో జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన విక్రవాండి, నాంగునేరి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అనూహ్య విజయం సాధించింది. గెలుపు మాత్రమే కాదు రెండు నియోజకవర్గాల్లో యాభై శాతం ఓటర్లు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపడం మారుతున్న సమీకరణాలకు సంకేతాలని చెప్పాలి. బలమైన డీఎంకే ను కాదని ప్రజలు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటన్న దానిపై డీఎంకేలోనూ లోతుగా చర్చ జరుగుతోంది.

రెండు చోట్ల గెలవడంతో….

మరోవైపు పళనిస్వామి ఈ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఆయన పార్టీ పై పట్టు పెంచుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ అరకొర ఓటములతో ఉన్న అన్నాడీఎంకేకు 2021 శాసనసభ ఎన్నికలకు ముందు లభించిన విజయం టానిక్ లాంటిదనే చెప్పాలి. ఇప్పటి వరకూ పళనిస్వామిని ఒక బలహీన ముఖ్యమంత్రిగా ప్రతిపక్షం భావించింది. విశ్లేషకులు సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కానీ పళనిస్వామి ఈ గెలుపుతో ప్రభుత్వలోనూ, పార్టీలోనూ తనదంటూ ముద్ర వేసుకున్నట్లయింది.

పన్నీర్ సెల్వం కూడా….

ఇప్పటికే పళనిస్వామికి ప్రభుత్వంలో, పార్టీలో మద్దతు పెరిగింది. జయలలిత లేని లోటును పళనిస్వామి తీరుస్తున్నారని క్యాడర్ కూడా నమ్ముతుంది. జయలలిత హామీ ఇచ్చిన స్కీమ్ లన్నింటిని పళనిస్వామి క్రమంగా ప్రజల చెంతకు చేరుస్తున్నారు. దీంతో పళనిస్వామి నాయకత్వం పట్ల కొంత అనుకూలత ఏర్పడిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ పన్నీర్ సెల్వం కొంత ఇబ్బందిరకరంగా మారుతారని భావించినా పళనిస్వామికి ప్రభుత్వంలో ఉన్న పట్టును చూసి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

చిన్నమ్మ సలహాలతోనేనా?

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళ ను పళనిస్వామికి అత్యంత సన్నిహితుడు తరచూ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పళనిస్వామి శశికళ జైలుకు వెళ్లిన సమయంలోనే తనకు తాను, ప్రభుత్వం పూర్తి కాలం పరిపాలించడానికే పన్నీర్ సెల్వంతో మిలాఖత్ అయ్యారన్న వాదనలు కూడా వస్తున్నాయి. పళనిస్వామి ఇప్పటికీ శశికళ కు నమ్మినబంటేనని అన్నాడీఎంకే సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్న విషయం. మొత్తం మీద శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నాడీఎంకేలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

Tags: