Ys Sharmila : తొలిసారి ఎన్నికల బరిలోకి.. అలా జరిగితేనే షర్మిలమ్మ విజయం ఖాయమా?

పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు

Update: 2024-04-03 06:58 GMT

వైఎస్ షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదీ ఎక్కడో కాదు.. కడప పార్లమెంటు నియోజకవర్గంలో. కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలమ్మ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ ఎన్నికతో షర్మిల తన రాజకీయ సత్తా ఏంటో నిరూపించుకోనున్నారు. తేడా కొడితే మాత్రం ఇక తలెత్తుకోలేని పరిస్థితి. అందుకే షర్మిల పెద్ద సాహసానికే ఆమె ఒడిగట్టారన్నది వైఎస్ అభిమానులు సయితం అభిప్రాయపడుతున్నారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఆమె తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఎదుర్కొన బోతున్నారు.

Full Viewనేరుగా రాజకీయాల్లోకి...
వైఎస్ మరణం తర్వాత ఆమె నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. తన అన్న జగన్ కు అండగా నిలిచేందుకు పాదయాత్ర చేశారు. ప్రచారం నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్‌కు, షర్మిలకు రాజకీయంగా తలెత్తిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ ని స్థాపించారు. పాలేరు నుంచి పోటీ చేయాలని భావించారు. అక్కడ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. చివరకు ఎన్నికల సమయం వచ్చేసరికి పోటీ నుంచి తప్పుకున్నారు. తాను స్థాపించిన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. దీంతో ఆమె రాజకీయ ప్రస్థానం తెలంగాణ నుంచి ఏపీకి మార్చుకున్నారు.
వైఎస్ కుటుంబానికే...
కడప పార్లమెంటు నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబానికి అడ్డా వంటిది. 1989 నుంచి ఈ స్థానం నుంచి మరొకరు గెలవలేదు. అంతటి ఏకపక్షంగా ఉంటుంది ఇక్కడి ప్రజల తీర్పు. మూడున్నర దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కడప పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. 1989, 1991, 1996, 1998లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి గెలవగా, 1999, 2004లో వైఎస్ వివేకానందరెడ్డి విజయం సాధించారు. 2009, 2012లో వైఎస్ జగన్, 2014, 2019 లో వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు. అంటే వైఎస్ ఇంటిపేరుకే జనం జై కొట్టారు తప్పించి మరొకరిని ఇక్కడ గెలిపించలేదు.
విభిన్నమైన పరిస్థితి...
కానీ ఈసారి విభిన్నమైన పరిస్థితి. వైసీపీ నుంచి మూడోసారి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి తొలిసారి వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు కడప ప్రజలు వీరిలో ఎవరిని గెలిపిస్తారన్నది మాత్రం రాష్ట్రమంతటా ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఇద్దరూ వైఎస్ కుటుంబీకులే. అన్నా, చెల్లెళ్ల సమరంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడే తెలియకున్నా ఒకటి మాత్రం నిజం.. షర్మిల తనకు తాను రాజకీయ పరీక్షను పెట్టుకోనున్నారు. శాసనసభ నియోజకవర్గాల పరంగా చూస్తే వైసీపీ బలంగా ఉంది. కాంగ్రెస్ బలహీనంగా ఉంది. మరి టీడీపీ ఓటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే షర్మిల గట్టిపోటీ ఇవ్వనున్నారు. అలా కాకుండా తమ కూటమి అభ్యర్థి వైపు నిలిస్తే షర్మిలకు గడ్డు పరిస్థితి ఎదురవుతుందన్న అంచనాలున్నాయి. అయితే వైెఎస్ షర్మిల కావడంతో వైసీపీ అభిమానుల ఓట్లు కూడా షర్మిల ఖాతాలో పడే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. మొత్తం మీద కడపలో మాత్రం ఈసారి ఆట మామూలుగా లేదు.


Tags:    

Similar News