Chandrababu : అరుదైన రికార్డుకు చేరువలో చంద్రబాబు.. దానిపైనే గురి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన ఖరారయింది

Update: 2024-03-23 12:27 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన ఖరారయింది. ఈ నెల ఇరవై ఐదు, ఇరవై ఆరు తేదీల్లో ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముందు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఆయన తన సొంత అడ్డాగా మార్చుకున్నారు. నిజానికి చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. ఆ నియోజకవర్గంలోని నారావారిపల్లి ఆయన స్వగ్రామం.

1989 నుంచి...
అయితే అక్కడి నుంచి కాకుండా కుప్పం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు 1989లో నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం ఆయన కుప్పంను తన కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు అపజయం అంటూ లేదు. వరస గెలుపులతో ఆయన సుదీర్ఘ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. కుప్పం నియోజకవర్గం ప్రజలు కూడా చంద్రబాబును తప్ప మరెవరినీ దాదాపు నలభై ఏళ్ల నుంచి ఆదరించకపోవడం విశేషం. ఆయన వైపు మొగ్గు చూపుతూ ఆయనకే అత్యధికంగా ఓట్లు వేస్తూ తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ వస్తున్నారు. ఆయన ఎప్పుడూ పెద్దగా ప్రచారం చేయరు. కుటుంబ సభ్యులే ఆయన తరుపున నామినేషన్ దాఖలు చేయడం దగ్గర నుంచి ప్రచారం కూడా చేస్తారు.
ఏడుసార్లు గెలిచి...
కుప్పం నియోజకవర్గం ఇటు తమిళనాడు, అటు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ ఎక్కువగా తమిళం, కన్నడ మాట్లాడే వాళ్లు కూడా ఎక్కువ. ఎక్కువ మంది ప్రజలు అక్కడకి వలస వచ్చిన వారేనని చెబుతారు. అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకున్న చంద్రబాబు అక్కడే జెండా పాతారు. 1989 లో తొలిసారిపోటీ చేసిన తర్వాత వరసగా 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ మరొకసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంతో ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు.
అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా...
ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. 1989 నుంచి తొలిసారి పోటీ చేసి కుప్పం నుంచి నెగ్గిన చంద్రబాబు ఆ తర్వాత వరసగా ఏడుసార్లు అక్కడి నుంచే గెలిచారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎనిమిదోసారి అక్కడి నుంచి గెలిచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలకు అప్పగించారు. ఈసారి గెలిస్తే ఎనిమిది సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన నేతగా రికార్డు సృష్టించినట్లవుతుంది. అందుకే చంద్రబాబు మరొకసారి కుప్పంను ఎంచుకున్నారు.
వ్యూహంతో వైసీపీ...
గత ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడంతో వైసీపీ కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఎమ్మెల్సీ భరత్ ను ముందుగానే అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోకవర్గంలో తరచూ పర్యటిస్తూ టీడీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంను మున్సిపల్ రెవెన్యూ డివిజన్ గా చేయడం, సాగునీరు అందించడం ద్వారా చంద్రబాబును దెబ్బతీయాలన్న వ్యూహంతో తొలి నుంచి వైసీపీ పనిచేస్తుంది. అయితే చంద్రబాబును కాదని కుప్పం నియోజకవర్గం ప్రజలు మాత్రం ఇప్పటి వరకూ మరొకరి వైపు మొగ్గు చూపలేదు. ఈసారి ఎలాంటి ఫలితం ఉండనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


Tags:    

Similar News