Raghu Rama Krishna Raju : ఎగిరెగిరి పడితే అంతే బాబాయ్...చివరకు సీటు పాయె.. సిట్టింగ్ స్థానమూ పాయె

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు క్రాస్ రోడ్ లో నిలబడ్డారు. ఆయనకు నరసాపురం సీటు దక్కలేదు

Update: 2024-03-25 06:09 GMT

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందటారు.. ఇగోకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తానే తోపునని భావిస్తే... రాజకీయాల్లో తోసి పడేస్తారు. ఈ ఉదాహరణలకు, సామెతకు ఒకే ఒక్కడు కనిపిస్తాడు రఘురామ కృష్ణరాజు. డబ్బుందని.. తన ఇమేజ్ వల్లనే గెలిచాడని ఆయన ఇన్నాళ్లు భ్రమలో ఉన్నాడు. టిక్కెట్ ఇచ్చి ఎంపీ చేసిన పార్టీ అధినేతపైనే విమర్శలకు దిగాడు. ప్రత్యర్థులతో చేతులు కలిపాడు. చివరకు ఆయన టిక్కెట్ కే ఎసరు వచ్చింది. పార్టీలు పెద్దగా పట్టించుకోక పోవడంతో నరసాపురం నుంచి ఐదేళ్ల పాటు రఘురామ కృష్ణరాజు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. ఇది స్వయంకృతాపరాధమని చెప్పక తప్పదు.

అంతా తన వల్లనే అంటూ...
రఘురామ కృష్ణరాజు ... 2019 ఎన్నికల్లో నరసాపుంర పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. ఆ విజయం తనవల్లనేనని ఆయన భావించాడు. జగన్ బొమ్మతో గెలవలేదని, తన ఇమేజ్ తోనే గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. గెలిచిన ఏడాది తర్వాత వైసీపీ అధినాయకత్వానికి దూరమయ్యాడు. ఇక అప్పటి నుంచి దాదాపు నాలుగేళ్ల పాటు నరసాపురంలో కాలుమోపలేకపోయారు. కేసు నమోదయి చివరకు ఆయన అష్టకష్టాలు పడ్డారు. ఢిల్లీలో ప్రతిరోజూ రచ్చ బండ పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీని కూడా ఇబ్బందిపెట్టేలా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
Full Viewబీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో...
అయితే రఘురామ కృష్ణరాజు ఈసారి నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించారు. టీడీపీలో చేరాలనుకున్నా నరసాపురం పొత్తులో భాగంగా బీజేపీ చేతిలోకి నరసాపురం వెళ్లడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. తనకున్న లాబీయింగ్ మొత్తాన్ని ఉపయోగించారు. హస్తినలో తనకున్న పలుకుబడిని ఉపయోగించినా ఆయనకు మాత్రం సీటు దక్కలేదు. చివరకు బీజేపీ అధినాయకత్వం నరసాపురం సీటును శ్రీనివాసవర్మకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రాజుగారు డీలా పడ్డారు. ఇదేంటి సామీ.. అంత ఎగిరిపడి చివరకు సీటు లేకుండా పోయిందా? అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. తనకు నరసాపురం టిక్కెట్ గ్యారంటీ అనుకుని విర్రవీగి చివరకు టిక్కెట్ రాక ఏం చెప్పాలో తెలియక తనకు సీటు రాకపోవడానికి సోము వీర్రాజు కారణమంటూ నిందలు ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అంతా ఒకే అయితే...?
ఇప్పుడు రఘురామ కృష్ణరాజు వద్ద ఒకే ఆప్షన్ ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడం. అది కూడా విజయనగరం సీటు మాత్రమే ఖాళీ ఉంది. రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరి విజయనగరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే తలనొప్పి పొలిటిషియన్ రఘురామ కృష్ణరాజుకు చంద్రబాబు ఈ అవకాశం ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది. విజయనగరం సీటు ఖాళీగానే ఉంది. అక్కడ అశోక్ గజపతిరాజుకు ఈసారి సీటు లేకపోవడంతో రఘురామ కృష్ణరాజుకు సీటు ఇస్తారని చెబుతున్నారు. అలా కాకుంటే ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా రాజుగారు భావిస్తున్నారట. దీంతో రఘురామ కృష్ణరాజు ఇప్పుడు క్రాస్ రోడ్ లో నిలుచున్నట్లయింది. అంతేగా... అంతేగా.. తామే తోపులని అనుకుంటే చివరకు ఎటూ కాకుండా పోయారంటూ వైసీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు.


Tags:    

Similar News