Ys Jagan : జగన్ ను ఇబ్బంది పెడుతున్న బలమైన అంశాలు ఇవే.. ఆ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడితే మాత్రం?

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు

Update: 2024-05-10 04:45 GMT

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకు ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి అడుగులు వేస్తున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ నుంచి ఓట్లు వచ్చి పడతాయో గుర్తించి దానిని ముందుగానే పసిగట్టి వాసనపట్టి.. దానినే పట్టుకుని ఐదేళ్లు కొనసాగిన నేతగా ముద్రపడ్డారు. ఎవరి మాట వినరన్న పేరుంది. ఎవరినీ కలవరని, కనీసం సొంత పార్టీ నేతలను కూడా ఆయనను కలవాలంటే కష్టమేనని పార్టీ లోనే వినిపిస్తున్న విమర్శ. ఇది అందరూ ఒప్పుకునే నిజమే. ప్రజల వద్దకు రావడం కంటే ఆయన కార్యాలయంలోనే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారంటారు.

మూడేళ్ల పాలనలోనే...
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా కాటేసింది. ఈ సమయంలో ఆయన పాలన పెద్దగా సాగలేదనే చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన ఏపీని పాలించింది కేవలం మూడేళ్లు మాత్రమేనని చెప్పకతప్పదు. అయితే సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేయరు. అది పేదల పైన ప్రేమ కావచ్చు. లేకుంటే ఓటు బ్యాంకును తన గడప దాటనివ్వకుండా కట్టడి చేసుకోవడం కోసం రూపొందించుకున్న ప్రత్యేక వ్యూహం కావచ్చు. చివరకు క్లిష్టమైన కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా లబ్దిదారులకు నేరుగా నగదును బదిలీ చేసిన ఘనతను సంపాదించుకున్నారు. అదే సమయంలో తన ఒక్కడితే ప్రభుత్వం, పార్టీ నడవాలని కోరుకునే అరుదైన నేతగా కూడా జగన్ పై విమర్శ ఉంది. పార్టీలో ఎవరికీ క్రెడిట్ దక్కనివ్వరు. చివరకు మంత్రులయినా ఉత్సవవిగ్రహాలే. అయితే జగన్ సంక్షేమ పథకాలను మినహాయించి అభివృద్ధిని పెద్దగా పట్టించుకోరన్న విమర్శలున్నాయి.

పేద ప్రజలు : అసలైన జగన ఓటు బ్యాంకు ఇదే. వీరే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తనను మరోసారి అందలం ఎక్కిస్తారని నమ్ముతున్నారు. అందుకే పేద ప్రజల సంక్షేమానికి ఐదేళ్ల పాలనలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చార. ఉద్యోగుల జీతాలు ఆలస్యమయినా సరే పథకాల పంపిణీలో మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయరు. వారికి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వారి ఖాతాల్లో నగదు వేస్తూ నయా ట్రెండ్ కు నాంది పలికారు.మహిళలు : రాష్ట్రంలో అత్యధిక ఓటర్లుగా ఉంది మహిళలే. ఏ పథకమైనా వీరి పేరిట ఇవ్వాల్సిందే. అక్కా చెల్లెమ్మలంటూ వీరిని తన వైపునకు తిప్పుకుని, వారి దృష్టి మరలకుండా గట్టిగానే ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ప్రయారిటీ ఇచ్చారు. బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి లక్షల రూపాయలు నగదు వచ్చిపడుతుండటంతో అది జగన్ వల్లనే అని ఎక్కువ మంది మహిళలు నమ్ముతున్నారు. ఇది ప్లస్ అని చెప్పాలి.

మధ్యతరగతి : జగన్ పాలనపై అసంతృప్తిగా ఉన్నది ఈ వర్గమే. ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు తమకు పథకాలు అందకపోవడంతో పాటు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఈ వర్గం దూరమయిందనే చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సర్టిఫికెట్లను ఇంటికే తెచ్చి ఇస్తూ ఉండటం, విద్య, వైద్య రంగాల్లో ఒకింత శ్రద్ధ పెట్టడంతో ఈ వర్గంలో కొంత భాగం జగన్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయన్న విశ్లేషణలున్నాయి. విద్యుత్తు బిల్లులు కూడా జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారనున్నాయన్నది వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్తు ఛార్జీలు పెంచడం కూడా ఒకింత జగన్ కు నష్టం చేకూర్చే అంశమే.

ప్రభుత్వోద్యోగులు : ప్రభుత్వోద్యోగుల్లో 90 శాతం మంది జగన్ ను వ్యతిరేకించే వారే. జీతాలు సరిగా చెల్లించకపోవడం, ఒకటో తేదీన జీతాలు రాకపోవడం, తమకు రావాల్సిన ప్రయోజనాలు దక్కకపోవడం, ఉద్యోగ పరంగా తమను, ప్రజల నుంచి వేరు చేయడం వంటి వాటితో ప్రభుత్వోద్యోగులు జగన్ కు దూరమయ్యారని చెప్పాలి. ప్రధానంగా ఉపాధ్యాయ వర్గాలు 99 శాతం మంది జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం 99 శాతం మాత్రం జగన్ కు మద్దతు పలికే అవకాశముంది.

యువత : యువతలో ఎక్కువ మంది జగన్ వెంట ఉండటం జరగదు. అదే సమయంలో వారు ఓట్లు వేసేది కూడా అనుమానమే. సోషల్ మీడియాలో తమ వ్యతిరేకతను వ్యక్త పర్చే యువత పోలింగ్ వద్దకు వచ్చేసరికి పూర్తిగా వెనకబడి ఉంటారన్న అపవాదు ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండటం వారికి ఇష‌్టం లేని పని. అదే జగన్ కు కొంత మేలు చేకూర్చే అవకాశముందని కూడా చెబుతున్నారు. యువత లో కొత్తగా ఓటర్లుగా చేరిన వారు మాత్రం తమ చదువుకు దోహదపడిన జగన్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదు. దీంతో పాటు యువతలో ఎక్కువ భాగం ఉపాధి అవకాశాలు లేరన్న అసంతృప్తిలో ఉన్నారు.

వ్యాపారులు : వ్యాపార వర్గాలు ఒకింత జగన్ పాలనపై అసహనంతోనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకుచెందిన వాళ్లు పూర్తిగా ఈ ఐదేళ్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మద్యం వ్యాపారం చేసిన వాళ్లు సయితం జగన్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులు ప్రభుత్వమే నడపటంతో వారి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఇక పెద్దగా యాక్టివిటీ రాష్ట్రంలో లేకపోవడం, పర్యాటక రంగం కూడా అభివృద్ధి అనుకున్నంత మేర జరగకపోవడంతో వ్యాపార వర్గాల్లో ఎక్కువ శాతం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ కోరుకోకపోవచ్చు. వారిలో ఎక్కువ భాగం మార్పుకోరుకుంటున్నారన్నది వాస్తవం.
Tags:    

Similar News