Ys Jagan : ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టండి.. మే 13న కురుక్షేత్రమే

పేదలంతా ఒకవైపు పెత్తందార్లు మరొక వైపు ఈ ఎన్నికల్లో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

Update: 2024-03-29 13:03 GMT

మే పదమూడో తేదీన కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేదలంతా ఒకవైపు పెత్తందార్లు మరొక వైపు ఈ ఎన్నికల్లో ఉన్నారన్నారు. ఈపొత్తులను జిత్తులను ఎదుర్కొని ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. యాభై ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. ఈ ఐదేళ్లు మీ ఇంట్లో మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం అన్ని రంగాలను విస్మరించిందన్నారు. విద్య, వైద్యరంగాలకు పేదలను గత ప్రభుత్వం దూరం చేసిందని, వారికి దగ్గర చేయడానికే తాను చేసిన ప్రయత్నం సఫలమయిందన్నారు.

మహిళల కోసం ఈ ప్రభుత్వం
మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పధకాన్ని కూడా తీసుకురాలేదన్నారు జగన్. విద్యా, వైద్య రంగాలను విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత విద్య, వైద్యరంగాలపైనే దృష్టి పెట్టామన్నారు. పేదలు చదువుకుంటేనే వారి బతుకులు బాగుపడతాయని నమ్మి తాను విద్యావిధానంలో సమూలమైన మార్పులు తెచ్చామన్నారు. ప్రభుత్వానికి రాఖీ కట్టాలని అక్క చెల్లెమ్మలను కోరుతున్నానని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలను కూడా అక్కచెల్లెమ్మల పేర్లు మీద ఇచ్చామని, వారికి ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నామని తెలిపారు. వారి రక్షణ కోసం దిశ యాప్ ను తీసుకు వచ్చామని తెలిపారు.
బ్యాంక్ అకౌంట్ చూడండి....
అందుకే ఇప్పటి వరకూ పేదల ఖాతాల్లో 2.75 లక్షల కోట్ల రూపాయలను జమ చేశామని తెలిపారు. పింఛను ను కూడా ప్రతి నెల ఒకటోతేదీ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈని కూడా తెస్తున్నామని తెలిపారు. ధనికులకు అందే చదువును పేదలకు కూడా అందిస్తున్నామని తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సంక్షేమాన్ని ఉద్యమంలా నడిపిన ఈ ప్రభుత్వానికి రక్షాబంధన్ ను కట్టాలని ఆయన కోరారు. అన్ని నియామకాల్లో మహిళలకు అవకాశాలు కల్పించామని తెలిపారు. అక్కచెల్లెమ్మల జీవితాల్లో మార్పు గతంలో ఎన్నడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. పది సంవత్సరాల మీ బ్యాంక్ అకౌంట్ చూస్తే చాలు ఎవరు మేలు చేశారన్నది అర్థమవుతుందన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మనదే...
ప్రతిపక్షం మోసాన్ని నమ్ముకుంటే...ఈ ప్రభుత్వం మంచిని నమ్ముకుందన్నారు. కేవలం శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు మాత్రమే కాదని, కోట్ల మంది అక్కచెల్లెమ్మల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు. ప్రతి రైతు ఆలోచించాలని, ఐదేళ్లలో రైతులకోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తించాలని ఆయన కోరారు. ఎన్ని కుట్రలు చేసినా మనమే గెలవబోతున్నామని ఆయన అన్నారు. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకు వచ్చి అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.


Tags:    

Similar News