Chandrababu : చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నట్లే ఉన్నాడు... ఆయన ప్రతి అడుగు అదే చెబుతుందిగా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లే కనపడుతున్నాడు. ఆయన ప్రతి అడుగులోనూ టెన్షన్ కనిపిస్తుంది.

Update: 2024-05-06 07:55 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లే కనపడుతున్నాడు. ఆయన ప్రతి అడుగులోనూ టెన్షన్ కనిపిస్తుంది. నిర్ణయాల్లో కావచ్చు.. ప్రసంగాల్లో కావచ్చు.. కొంత తేడా కనపడుతుంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చంద్రబాబు ప్రసంగాల్లో కొంత మాటలు కూడా స్లిప్ అవుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితి. గత ఎన్నికల్లో లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశాడని జగన్ పై పదే పదే ఆరోపణలు చేసినప్పటికీ జనం నమ్మలేదు. ఈసారి చంద్రబాబు తాను చేసే ఆరోపణలను జనం నమ్ముతారా? లేదా? అన్న భయంలో మాత్రం ఆయన ఉన్నట్లే స్పష్టంగా కనిపిస్తుంది. తాను జైలులోకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా సింపతీ పెద్దగా కనపడక పోవడంపై కూడా టీడీపీ అధినేత కొంత కలత చెందుతున్నారని సన్నిహత వర్గాలు చెబుతున్నాయి.

45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా...
గత నలభై ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయంగా వత్తిడిని అయితే ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రజాగళంలో చేస్తున్న ప్రసంగాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తానని చెప్పేదానికంటే ఎక్కువగా జగన్ ప్రభుత్వంపై విమర్శలకు ఆయన తీవ్ర స్థాయిలో దిగుతున్నారు. సాధారణంగా సూపర్ సిక్స్ తో పాటు మ్యానిఫేస్టోను కూడా విడుదల చేసిన తర్వాత వాటి గురించి ఎక్కువ చెప్పాల్సి ఉండగా, వాటిని పెద్దగా ప్రస్తావించకుండా జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మీ ఆస్తులు కాజేస్తారంటూ ప్రజలను భయపెట్టే పనిలో ఉన్నారు. ఎవరైనా భయపడే వారే ఎదుటి వారిని భయపెడతారన్న మానసిక నిపుణులు చెబుతున్న మాటలకు అనుగుణంగానే ఆయన రాజకీయ ప్రసంగాలు సాగుతున్నాయని చెప్పాలి. అందుకే ఆయన వత్తిడిలో ఉన్నారని చూసే వారికి ఎవరికైనా అర్థమవుతుంది.
ఎవరితో కలవకుండా...
ఇక చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి కాకుండా అంతా తానే అయి ప్రజాగళం పేరిట విస్తృతంగా పర్యటిస్తున్నారు. చివరకు తన కుమారుడు లోకేష్ ను కూడా మంగళగిరిలోనే ఎక్కువ సేపు ఉండేలా కట్టడి చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఎంచుకున్న ప్రాంతాల్లోనే ఉమ్మడి సభలను ఏర్పాటు చేస్తున్నారు. అదీ తనపైన, తనకుటుంబంపైన తీవ్ర స్థాయి విమర్శలు చేసే వైసీపీ నేతల నియోజకవర్గాలకే పవన్ ను వెంట తీసుకెళుతున్నారు. ఇక మోదీ, అమిత్ షా సభలకు కూడా ఆయన హాజరవుతూ తన బలం.. బలగం ఇదీ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది ఎంత అవసరమో ఆయన పార్టీ నేతలకు తెలియజేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా జరిగినా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఆయనకు తెలియని విష‍యం కాదు. అందుకే ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తున్నారు.
ఎడాపెడా వరాలు...
ముఖ్యంగా మ్యానిఫేస్టోలో అలివి కాని హామీలు ఇవ్వడం కూడా ఆ వత్తిడి కారణమని చెప్పక తప్పదు. బడ్జెట్ సరిపోతుందా? లేదా? అన్నది ఆలోచించకుండా యాభై ఏళ్లు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛను ఇస్తామని చేసిన ప్రకటన కూడా ఇందులో భాగమేనని చెప్పక తప్పదు. అలాగే ఇంట్లో ఎంత మంది ఉన్నా తల్లికి వందనం ఇస్తామని, పింఛను మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కావచ్చు.. రైతులకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అవ్వొచ్చు... దీంతో పాటు కులాల వారీగా కార్పొరేషన్లకు కేటాయించే నిధులు కూడా వేల కోట్లు కేటాయిస్తామని చెబుతూ ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఇన్ని రకాల హామీలు, వాగ్దానాలు ఇస్తున్నారంటే ఎంత వత్తిడిలో ఉన్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి చివరకు గెలుపు ఎవరికి దక్కుతుందో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం అంత హ్యాపీగా లేరన్నది వాస్తవం.
Tags:    

Similar News