Magunta : ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఆపింది అందుకేనా? వత్తిడి పై నుంచి వచ్చిందా ఏంటి?

టీడీపీ చంద్రబాబు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించలేదు

Update: 2024-03-23 05:47 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ పదమూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. వాటిలో ఒంగోలు, కడప, విజయనగరం, మచిలీపట్నం ఉన్నాయి. అయితే మిగిలిన స్థానాలను పక్కన పెడితే ఒంగోలు ఎంపీ టిక్కెట్ ను ఎందుకు ప్రకటించకుండా ఆయన ఆపారన్నది చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు పార్లమెంటు టిక్కెట్ మాగుంట రాఘవరెడ్డికి ఇవ్వాలని తొలుత భావించారు. ఆ హామీ మేరకే మాగుంట కుటుంబం టీడీపీలో చేరింది.

పేరు లేకపోవడం...
కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో మాగుంట రాఘవరెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మాగుంటకు చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరి వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఎంపీగా విజయం సాధించారు. మాగుంట కుటుంబం కాంగ్రెస్, వైసీపీల నుంచే ఒంగోలు ఎంపీలుగా ఇప్పటి వరకూ విజయం సాధిస్తూ వచ్చింది.
రిమాండ్ రిపోర్టులో...
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. రాఘవరెడ్డి కొన్ని నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితతో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు. వీరి రిమాండ్ రిపోర్ట్ లో మాగుంట రాఘవ రెడ్డి పేరు పదే పదే వినిపిస్తుంది. దీంతో బీజేపీ ఆ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వవద్దని షరతు పెట్టిందన్న వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ గా మారాారు. కల్వకుంట్ల కవిత మాగుంట రాఘవరెడ్డి నుంచి ముప్ఫయి కోట్ల రూపాయలను వసూలు చేసి ఆప్ నేతలకు అందచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే వైసీపీ కూడా ఆయన పేరు పక్కన పెట్టిందన్నది అప్పట్లో ప్రచారం జరిగింది. అదే చంద్రబాబు కూడా చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్న ప్రజల నుంచి వచ్చే అవకాశముంది. ఇదే వత్తిడి బీజేపీ నుంచి కూడా వచ్చిందంటున్నారు. అందుకోసమే మాగుంట రాఘవరెడ్డి పేరును ప్రకటించకుండా చంద్రబాబు స్కిప్ చేశారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి ఆయన టిక్కెట్ చివరకు వస్తుందో? లేదో? చూడాల్సి ఉంది.


Tags:    

Similar News