Janasena : టీడీపీలో టిక్కెట్ రాకపోతే.. జనసేనలో చేరాల్సిందేనా?

ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆ పార్టీకి నేతలున్నా అభ్యర్థులు మాత్రం పవన్ కల్యాణ్ కు కనిపించడం లేదు

Update: 2024-04-01 12:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆ పార్టీకి నేతలున్నా అభ్యర్థులు మాత్రం పవన్ కల్యాణ్ కు కనిపించడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే టిక్కెట్లు ఇస్తూ 21 స్థానాల్లో ఏదో తమ అభ్యర్థులున్నారని చెబుతున్నారు కానీ.. వారంతా టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. ఇప్పటి వరకూ 21 స్థానాలను ప్రకటించగా అత్యధిక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చి జనసేన నేతల్లోనూ, పార్టీ క్యాడర్ లోనూ పవన్ కల్యాణ్ తప్పుడు సంకేతాలను పంపినట్లయింది. ఇది ఆయనకు, ఆయన పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రశ్నించేది... నేనే.. నన్ను ఎవరూ ప్రశ్నించ కూడదన్న తరహాలో ఆయన ధోరణి ఉంది.

అభ్యర్థుల ఎంపికలో...
తాజాగా అవనిగడ్డ నుంచి మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా జనసేన పార్టీ తీర్థం నేడు పుచ్చుకోనున్నారని సమాచారం. ఇప్పటి వరకూ జనసేన 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పాలకొండ, అవనిగడ్డ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టింది. అవనిగడ్డలో అనేక మంది జనసేన తరుపు నుంచి పోటీ పడుతున్నారు. చంద్రబాబు తరహాలోనే అవనిగడ్డలో ఐవీఆర్ఎస్ సర్వేను పవన్ కల్యాణ్ నిర్వహించారు. వికృతి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ పేర్లను పరిశీలించారు. అయినా అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి తోడు అవనిగడ్డ జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ అభిమానులు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే కేవలం మండలి బుద్ధప్రసాద్ కోసమే ఈ స్థానాన్ని రిజర్వ్ చేసి ఉంచారని, చంద్రబాబు సూచన మేరకు మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరి టిక్కెట్ దక్కేలా ఒప్పందం కుదిరిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అలాగే ఆయన ఈరోజు పార్టీలో చేరారు.
మండలి నేడు చేరిక?
మండలి బుద్ధప్రసాద్ కు మంచి పేరుంది. సౌమ్యుడిగా ఆయన అందరికీ సుపరిచితుడే. ఆయన కుటుంబం కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మండలి బుద్ధప్రసాద్ 2014 లో అవనిగడ్డ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరికను ఎవరూ తప్పుపట్టడం లేదు కానీ, కేవలం టిక్కెట్ కోసమే చేరుతున్నారంటే.. అది టీడీపీ వ్యూహంలో భాగమేనని జనసైనికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తొలుత 24 స్థానాలు, ఆ తర్వాత 21 స్థానాలకు కుదించుకున్న జనసేన ఇప్పుడు ఇతర పార్టీల వారికి సీట్లు ఇవ్వడమేంటని ఆ పార్టీనేతలు గుర్రుమంటున్నారు. ఇలా ఇతర పార్టీల నేతలకు ఇచ్చుకుంటూ పోతే తాము జెండా పట్టుకోవడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
వీరంతా ఎవరయ్యా....?
భీమవరం అభ్యర్థి పులవర్తి ఆంజనేయులు టీడీపీ నుంచి వచ్చారు. తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, విశాఖ సౌత్ అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ వైసీపీ నుంచి వచ్చి పార్టీ పదవులు పొందారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా వైసీపీ నుంచి వచ్చిన వారే. తాజాగా మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా వినపడుతుంది. ఇలా టీడీపీలో టిక్కెట్ రాకపోతే ఇలా జనసేనలో చేరి టిక్కెట్లు దక్కించుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఇన్నాళ్లూ పనిచేసిన తమను పక్కన పెట్టి ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కట్లు ఇచ్చుకుంటూ పోతే తమ రాజకీయ భవిష్యత్ ఏంటని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. ఈరోజు మండలి బుద్ధప్రసాద్ కూడా చేరడంతో ఆయనకు దాదాపు టిక్కెట్ ఖరారయినట్లే. ఇక దాదాపు సగం మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చినట్లవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News