NDA Manifesto : థాంక్ గాడ్.. మాఫీ.. లేదు.. కులం కార్డుతో కొట్టాలని చూశారుగా

తెలుగుదేశం పార్టీ మ్యానిఫేస్టో విడుదలయింది. అయితే మ్యానిఫేస్టో చూసిన వారికి ఎవరికైనా అనుమానం కలగక మానదు

Update: 2024-04-30 12:42 GMT

తెలుగుదేశం పార్టీ మ్యానిఫేస్టో విడుదలయింది. అయితే మ్యానిఫేస్టో చూసిన వారికి ఎవరికైనా అనుమానం కలగక మానదు. ఇది ఆచరణ సాధ్యమేనా? అనన అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం కోసమే హామీలు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కుతూ లబ్దిదారులకు నిధులను విడుదల చేస్తుంటే ఏపీ మరో శ్రీలంకలా మారుతుందని అన్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పడు మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలను చూస్తుంటే.. శ్రీలంకను దాటేసి.. పాక్ ను మించిపోయేలా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి కులాన్ని ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోను రూపొందించారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆర్యవైశ్యులు, కాపులు, బ్రాహ్మణులు, బీసీలు.. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై వరాల జల్లు కురిపించారు.

సూపర్ సిక్స్ లో...
సూపర్ సిక్స్ లో ఇంతకు ముందే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇక ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరాతో పాటు ‘తల్లికి వందనం' కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఇస్తామని ఆయన ప్రకటించారు.
పది వేలకు ఎవరికీ తగ్గకుండా...
ఇక ప్రతి నెల ఇచ్చే పింఛన్లు ఏకంగా మూడు వేల నుంచి నాలుగువేలకు పెంచారు. అదీ ఏప్రిల్ నుంచి తాను ఆ మొత్తాన్ని ఇస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పది వేల పింఛను ఇస్తామని చెప్పారు. వాలంటీర్లకు నెలకు పది వేల జీతం చేస్తామని తెలిపారు. పూర్తి వైకల్యానికి గురయిన వారికి పదిహేను వేల రూపాయలు పింఛను ఇస్తామని, కిడ్నీ, తలసీమియా వంటి వ్యాధి గ్రస్థులకు నెలకు పది వేల రూపాయలు పింఛను ఇస్తామని చెప్పారు. ఇక బీసీలలో యాభై ఏళ్లు నిండిన వాళ్లందరికీ పింఛను ఇస్తామని చెప్పారు. బీసీలకు ఐదున్నరేళ్లలో లక్షన్నరకోట్లు ఇస్తామని చెప్పారు. దీంతో పాటు కులాల వారీగా కూడా హామీలు ఇచ్చిన చంద్రబాబు మ్యానిఫేస్టోలో భారీగానే నిధులు ఇస్తామని ప్రకటించారు. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం కూడా నమ్మశక్యం లేదంటున్నారు.
వాస్తవదూరంగా ఉందంటూ...
అయితే ఈసారి మ్యానిఫేస్టోలో రైతు రుణమాఫీ ప్రస్తావన లేదు. అలాగే డ్వాక్రా మహిళ సంఘాల రుణాల రద్దు ప్రస్తావన లేకపోవడం ఒకింత సంతోషించదగ్గ పరిణామమే అంటున్నారు. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా ఉండదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు అంత ఆదాయం ఎక్కడిదంటే సంపద సృష్టిస్తారని చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే ప్రస్తుతమున్న లబ్దిదారులను తగ్గించనని చెప్పలేదు. అలాగే ఎప్పటి నుంచి అమలు చేస్తానన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వకపోవడం పై సోషల్ మీడియాలో ఇవన్నీ అయ్యే పనులేనా? అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి దూరంగా టీడీపీ మ్యానిఫేస్టో ఉందని అంటున్నారు.


Tags:    

Similar News