Pawan Kalyan : ఎంతో ఊహించుకున్నామయ్యా... చివరకు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న సీన్ తెచ్చావేమయ్యా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీఫారాలపై మాత్రమే సంతకం పెడుతున్నారని, తొలి సంతకం అదేనా? అన్న సెటైర్లు వినపడుతున్నాయి.

Update: 2024-04-17 07:36 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జనసైనికుల నుంచి సూటి ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఒకవైపు తాను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని, ముఖ్యమంత్రిగా తొలిసంతకాన్ని వాలంటీర్ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే ఫైలుపై పెడతానని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తాను జూన్ 4వ తేదీన నాలుగువేల రూపాయల పింఛను పై సంతకం చేస్తానని, వాటిని ఇంటి వద్దకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ అదే సమయంలో జనసైనికులు ఆశించినట్లు .. తొలి సంతకం మాట పవన్ నోటి నుంచి వినిపించకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. కేవలం బీఫారాలపై తొలి సంతకాలకే పరిమితయ్యేటట్లు కనిపిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి

కూటమి ఏర్పాటుతో....
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ అరవైకి పాగా స్థానాలను తీసుకుంటుందని భావించారు. అదే సమయంలో తనకంటూ ఒక వ్యూహమందని కూడా పవన్ చెబుతూ వస్తుండటంతో సీట్ల విషయంలో పవన్ తగ్డడని అందరూ భావించారు. ఫిఫ్టీ ఫిఫ్టీ గా ముఖ్యమంత్రి పదవిని అయినా పంచుకుంటారని పార్టీ నేతల నుంచి అభిమానుల వరకూ ఆశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన అవసరానికి పొత్తు కుదుర్చుకోవడంతో జనసేనాని ఈసారి గట్టిగానే సీట్లను కోరతారని అనుకున్నారు. కానీ ఏమయిందో ఏమో.. తెలియదు కానీ.. మొదట 24.. ఆ తర్వాత 21.. స్థానాలకు జనసేన పోటీ చేసే స్థానాలు పడిపోయాయి.
ఆ స్థానాల్లోనూ...
ఆ స్థానాల్లో కూడా అసలు సిసలైన జనసేన నేతలకు సీట్లు దక్కలేదు. టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారికే సీట్లు కేటాయించడంతో జనసైనికుల్లో ఒకరకమైన నిర్లిప్తత ఏర్పడింది. దీనికా మనం ఇంత కష్టపడేది? అన్న తరహాలో వారి మనోభావాలున్నాయి. తాము గత కొన్నేళ్లుగా కష్టపడి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసినా చివరకు తమకు సీటు రాకపోవడంతో అనేక మంది నేతలు రాజీనామా బాట పడుతున్నారు. అసలే ఉన్నది కొద్దిమంది నేతలు. ఆ నేతలు కూడా పార్టీని వీడిపోయే పరిస్థితి నెలకొంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, కైకలూరు, అవనిగడ్డ జనసేన నేతలు రాజీనామా బాట పట్టారు. తాము పార్టీ కోసం ఎందుకు ఇన్నాళ్లు కష్టపడ్డామని, గుర్తింపులేని చోట ఉండటమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
నమ్మించి మోసం చేశారంటూ...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేత పోతిన మహేష్ అయితే ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనే విమర్శలు చేశారు. తాను ఆస్తులు అమ్ముకుని జెండాను నియోజకవర్గంలో నిలబెడితే చివరకు తనను నమ్మించి మోసం చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు, బీజేపీ నేతలకు పట్టని రాష్ట్రాభివృద్ధి ఒక్క పవన్ కల్యాణ్ కే పట్టిందా? అని ప్రశ్నిస్తున్నారు. త్యాగాలు వాళ్లు చేయకుండా జనసేన నేతలనే చేయాలని చెప్పడం ఎంతవరకూ సబబని ఆయన నిలదీస్తున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ కు జనసైనికుల నుంచి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. మరి కొందరు నేతలు పార్టీని వదలి వెళుతున్నారు. ఈ ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానం రాకపోయినా.. ఎన్నికలకు ముందే గాజు గ్లాసులో టీ ఒలికిపోయిందన్న కామెంట్స్ నెట్టింట వినబడుతున్నాయి.


Tags:    

Similar News