Hyderabad : రేపు నగరం సగం ఖాళీ అవుతున్నట్లే.. షేరింగ్ సీట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు

హైదరాబాద్ నగరం రేపు ఖాళీ కానుంది. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2024-05-09 03:35 GMT

హైదరాబాద్ నగరం రేపు ఖాళీ కానుంది. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి సీమాంధ్రులు తమ సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ, ప్రయివేటు బస్సులను ముందుగానే బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులలో టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. ప్రయివేటు బస్సులలో అత్యధిక ఫీజులను వసూలు చేస్తున్నా ఎన్నికల కోసం సీమాంధ్రులు వారి సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో రేపు హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతందన్నది మాత్రం వాస్తవం.

వరస సెలవులు...
వరసగా సెలవులు మూడు రోజులు రావడంతో అత్యధిక మంది నగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ప్రధానంగా శని, ఆదివారాలు ఐటీ కంపెనీలకు సెలవులు కావడం, పోలింగ్ తేదీన కూడా అధికారికంగా ఐటీ సంస్థలన్నీ సెలవులు ప్రకటించడంతో అందరూ మూడు రోజుల పాటు తమ సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. కేవలం ఐటీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు, కూలీ పనులు చేసుకునే వారు సయితం సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. ఇప్పట్లో మళ్లీ ఇన్ని రోజులు వరస సెలవులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ మూడు రోజులు సొంత గ్రామంలో ఎంజాయ్ చేయడానికి బయలుదేరుతున్నారు.
పోలింగ్ రోజున...
పోలింగ్ అంటే ఒక పండగ. అదీ తమ సొంతూళ్లలో తమకు నచ్చిన వాళ్లకు ఓటేయాలన్నది కోరిక. దీంతో పాటు ఇక్కడ ఉన్న వారిని రప్పించేందుకు ఏపీకి చెందిన రాజకీయ పార్టీల నేతలు అనేక ప్రయివేటు వాహనాలను కూడా అరేంజ్ చేశారు. లారీలు, బస్సులతో పాటు కార్లను కూడా వినియోగించుకుంటున్నారు. అయితే ఎక్కడా చోటు దొరకని వారికి మాత్రం కార్లలో వెళ్లేందుకు ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో షేరింగ్ ప్రపోజల్స్ కనపడుతున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తిరుపతి వరకూ వెళ్లేందుకు అనేక మంది తమ కార్లలో చోటు ఉందని, వచ్చే వారు ఇంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, వాళ్లు అవుటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చి తమ వాహనాన్ని అందుకోవాలని పోస్టింగ్ లు పెడుతున్నారు. ప్రయివేటు బస్సులతో పోలిస్తే తక్కువ ధర కావడంతో కార్లలో వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద రేపు సాయంత్రం నుంచి జాతీయ రహదారులన్నీ వాహనాలతో రద్దీగా మారిపోవడం ఖాయం.


Tags:    

Similar News