Ap Politics : గెలిచాక మంత్రి అవుతారేమో.. ఎన్నికల్లోనే ఓడిస్తే పోలా.. ఇదీ ఏపీలో లేటెస్ట్ సీన్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో నెలరోజులు ఉన్నాయి. సరిగ్గా వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది.

Update: 2024-04-13 04:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో నెలరోజులు ఉన్నాయి. సరిగ్గా వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే.. అన్ని పార్టీల్లో కీలక నేతలను ఓడించేందుకు కోవర్టుగా మారడమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలోకి వస్తే రెండు, మూడు రకాలుగా మంత్రివర్గంలో ఎవరైనా స్థానం కల్పిస్తారు. అదే ఇప్పుడు కొందరి పాలిట శాపంగా మారింది. తమ పార్టీ వారినే తాము ఓడించేందుకు రెడీ అయ్యారు. ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నా ఈ ఎన్నికల్లో మరీ శృతిమించి బహిరంగమయిందన్న విషయం తెలిసిన పార్టీ అగ్రనేతలు ఆశ్చర్యపోతున్నారట. ఇప్పటికే ఈ సమాచారం తెలిసి కొందరి నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారట.

మూడు రకాలుగా...
అధికారంలోకి రాగానే సామాజికవర్గం పరంగా, మహిళ కోటాలో, సీనియారిటీని చూసి ఇలా మూడు రకాలుగా మంత్రి పదవులను ఎవరైనా ఇస్తుంటారు. చంద్రబాబు అధికారంలోకి రానివ్వండి. జగన్ పవర్ లోకి రానివ్వండి.. అదే సూత్రం. కాకుంటే కొందరికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి మరొకసారి మలి విడత మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారు. అందుకే ఇప్పుడు జిల్లాల్లో నేతలు సీనియర్ నేతలను, మహిళ అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే సిద్ధమవుతున్నారన్న సమచారం రావడంతో పార్టీ అగ్రనేతలు ఆశ్చర్యపోతున్నారట. ఫోన్ రికార్డింగ్‌లు కూడా వారికి లభ్యం కావడంతో పిలిచి మరీ అక్షింతలు వేస్తున్నారట.
టీడీపీ అధినేత పిలిచి...
ప్రకాశం జిల్లాలో ఈసారి ఆయన గెలిస్తే హ్యాట్రిక్ విజయం అవుతుంది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆయనకు పదవి గ్యారంటీ. సామాజివకర్గం పరంగా కూడా ఆ నేతకు అన్నీ ప్లస్ గా ఉండటంతో అక్కడ ఆయనను ఓడించేందుకు జిల్లా అధ్యక్షుడే సిద్ధమయినట్లు వచ్చిన వార్తలు కలవరం కలిగిస్తున్నాయి. ఆయన గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని, అందుకే ఆయనను ఓడించండంటూ తన క్యాడర్ కు సదరు నేత ఫోన్లలో ఆదేశాలివ్వడం ఇందుకు అద్దం పడుతుంది. దీంతో ఇది తెలిసిన ఆ నేత పార్టీ చీఫ్ కు సమాచారం ఇవ్వడంతో ఆయనను పిలిచి మరీ అధినేత క్లాస్ పీకినట్లు తెలిసింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాగైనా అధికారంలోకి వస్తుందని గుంటూరు, చిత్తూరు, విజయనగరం జిల్లాలోనూ ఇదేరకమైన సీన్ క్రియేట్ కావడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
వైసీపీలో కూడా...
ఇందుకు వైసీపీ కూడా ఏమీ మినహాయింపు కాదు. గతంలో గెలిచిన వాళ్లను ఓడించి మంత్రిపదవి దక్కకుండా చేయాలని కొందరు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా ఒక మంత్రి స్థాయిలో ఉన్న నేత అక్కడ ఆ నేతను ఓడించి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారట. అందుకు అవసరమైన నిధులను తాను ప్రత్యర్థికి కూడా సమకూర్చడానికి రెడీ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు జిల్లాలోనూ గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని ఓడించడానికి వైసీపీ నేతలే నడుంబిగించడం విశేషం. ఇలా జనసేనలోనూ గుంటూరు జిల్లాలో కీలక నేతను ఓడించడానికి ఆ పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇంతకీ అధికారం ఎవరిది? అన్నది తెలియకున్నా.. వస్తే మంత్రి పదవికి తమకు అడ్డం కాకూడదని వారిని ఎన్నికల్లోనే తప్పించే ప్రయత్నానికి కొందరు నేతలు దిగుతుండటం నిజంగా విచారకరమే మరి.


Tags:    

Similar News