Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ చెప్పిందే నిజం కానుందా...? వైసీపీలో అంతర్గత చర్చ.. ఎన్నికల వేళ ఫ్యాన్ పార్టీలో గందరగోళం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఏపీ రాజకీయాలపై చేసిన కామెంట్స్ ఇంకా రాజకీయాల్లో నలుగుతూనే ఉన్నాయి

Update: 2024-04-11 12:01 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఏపీ రాజకీయాలపై చేసిన కామెంట్స్ ఇంకా రాజకీయాల్లో నలుగుతూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. పీటీఐ నిర్వహించిన ఎడిటర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పడు టీడీపీ సోషల్ మీడియా ప్రశాంత్ కిషోర్ వైసీపీ పై చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తుంది. కూటమి ఏర్పడటంతోనే విజయం తమది ఖాయమై పోయిందన్న భావనలో టీడీపీ ఉంది. అందుకు ప్రశాంత్ కిషోర్ కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి అన్న ధోరణి టీడీపీలో కనపడుతుంది.

అయితే ఆయన...
ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్త. అయితే ఇప్పుడు ఎన్నికల సర్వేలను చేయించడం మానేశారు. ఆయన ఐ ప్యాక్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆయన బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీలో ఐప్యాక్ టీం జగన్ పార్టీ తరుపున పనిచేస్తుంది. నియోజకవర్గాల్లో సర్వేలు చేసి మరీ నివేదికలను నేరుగా జగన్ కు అందించింది. అయితే పీకే లేని ఐ ప్యాక్ టీం అది. ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేసి మరీ ఎవరయితే గెలుస్తారు? ఎవరయితే నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందనేది ఐ ప్యాక్ టీం సర్వేలు చేసి మరీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే కేవలం దీనిమీదనే ఆధారపడకుండా జగన్ మరికొన్ని సంస్థల ద్వారా కూడా సర్వేలు చేయించుకుని అభ్యర్థులను ప్రకటించారు.
సర్వేల ద్వారా అందిన నివేదికలతో...
మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను జగన్ ఖరారు చేశారు. ఇప్పుడు బస్సుయాత్ర పేరుతో జనంలోకి వెళుతూ అభ్యర్థులను పరిచయం చేస్తున్నారు. దాదాపు వంద మందికిపైగా అభ్యర్థులను ఆయన మార్చారు. కొందరిని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయించగా, మరికొందరిని నియోజకవర్గాలను ఛేంజ్ చేశారు. ఆ నియోజకవర్గాల్లో సర్వే ఫలితాలు అనుకూలంగా లేకపోవడం వల్లనే మార్చానని జగన్ చెప్పుకొచ్చారు కూడా. దీంతో పాటు కొందరికి సీట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇప్పడు ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ఫ్యాన్ పార్టీ నేతల్లో కలవరం మొదలయిందనే చెప్పాలి. ఎందుకంటే పీకే అలా సులువుగా మాట్లాడే వ్యక్తి కాదు. తనకు ఏదైనా సమాచారం అందడం వల్లనే ఆ వ్యాఖ్యలు చేశారా? అని కూడా వైసీపీ నేతల్లో చర్చ జరుగుతుంది.
పట్టించుకోవద్దని చెబుతున్నా...
మరోవైపు ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదంటూ వైసీీపీ అగ్రనేతలు క్యాడర్ కు చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 2019 ఎన్నికల్లో పీకే వ్యూహరచన, జగన్ చరిష్మా కలసి వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఇప్పటికీ అనేక మంది ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు. అలాంటిది ప్రశాంత్ కిషోర్ ఉబుసుపోక అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని, తనకు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న సమాచారంతోనే ఈ కామెంట్స్ చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద పీకే వ్యాఖ్యలు మాత్రం ఫ్యాన్ పార్టీలో కొంత గందరగోళానికి దారి తీశాయి. తిరిగి అధికారంలోకి వస్తాడనుకున్న తమ అధినేత రారా? అన్న అనుమానంతో క్యాడర్ లో కొన్ని చోట్ల నిస్తేజం కూడా అలుముకుంది. మొత్తం మీద పీకే కామెంట్స్ ప్రభావం మాత్రం ఫ్యాన్ పార్టీలో బాగానే కనిపిస్తున్నట్లుంది.


Tags:    

Similar News