‍‍NDA Alliance : ముగ్గురిలో ప్లస్ లు ఏంటి? మైనస్ లు ఏంటి?

చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ముగ్గురు కలిశారు. ముగ్గురి మైండ్ సెట్ వేరు

Update: 2024-05-10 06:35 GMT

చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ముగ్గురు కలిశారు. ముగ్గురి మైండ్ సెట్ వేరు. అయితే ముగ్గురిదీ అధికారమే ఆఖరి లక్ష్యం. కాని కొన్ని విషయాల్లో మాత్రం ముగ్గురి అభిప్రాయాలు వేరు వేరుగా ఉంటాయి. గత పదేళ్ల నుంచి నరేంద్ర మోదీని, జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ను, నలభై ఐదేళ్ల నుంచి చంద్రబాబును రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ, పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఫుల్లు ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ లు ముగ్గురు కలిస్తే రానున్న ఎన్నికల్లో కూటమికి జరిగే లాభమేంటి? జరగనున్న నష్టమేంటి? అన్న దానిపై చర్చ జరుగుతుంది.

రెండో అతిపెద్ద పార్టీగా...
ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత స్థానం టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో పొత్తులు ఖరారయిన తర్వాత మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ నుంచి అత్యధిక స్థానాల్లో బీజేపీ పోటీ 445 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. పదిహేడు లోక్ సభ స్థానాల్లో పోటీతో రెండో స్థానంలో టీడీపీ ఉండగా, జేడీయూ 16 స్థానాలు, శివసేన షిండేవర్గం 13, పీఎంకే ౧౦ ఎన్సీపీ అజిత్ పవార్ 5, లోక్ జనశక్తి 5 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అందుకే ఏపీపై అందులోనూ దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత ఏపీ నుంచే ఎక్కువ స్థానాలు సాధించాలన్న ఉద్దేశ్యంతో కమలనాధులున్నారు. ఏపీలో కలిసిన ముగ్గురు నేతల మైండ్ సెట్ ను పరిశీలిస్తే....?

నరేంద్ర మోదీ : ప్రధానిగా పదేళ్ల పాటు పనిచేసిన నరేంద్ర మోదీపై అవినీతి మచ్చ లేదు. అయితే అదే సమయంలో పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అండగా నిలిచారన్న విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను ఏవీ అమలు పర్చరన్న అభిప్రాయం కూడా మోదీ పై ఉంది. 2014 ఎన్నికలకు ముందు స్విస్ నుంచి నల్లధనం తెప్పించి ప్రతి పేదవాడి బ్యాంకు అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తామన్నారు. వేయలేదు. అదే సమయంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఐదేళ్లలో కల్పిస్తామని గత ఎన్నికల్లో చెప్పారు. ఆచరణ సాధ్యంలో విఫలమయ్యారు. ఇక ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఇందులో భాగమే. ఇక విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినట్లు ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. పోలవరం నిర్మాణం నిధుల విడుదలలో శ్రద్ధ చూపలేదు. కాకుంటే రహదారులు, ఎయిర్‌పోర్టులు, రైళ్లు వంటి వాటిపై ఆయన ఎక్కువగా ఫోకస్ పెడతారన్న పేరుంది. గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంతో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలతో పాటు నిత్యావసర సరుకుల పెరుగుదలకు కారణమయ్యారన్న ఆరోపణలున్నాయి.
చంద్రబాబు : నలభై ఐదేళ్లు రాజకీయ అనుభవం ఉన్న నేతగా పేరుంది. విజన్ ఉన్న లీడర్ గా ఆయనకు ఇప్పటికీ ముద్ర ఉంది. అయితే ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో గెలవలేరన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. అది రాజకీయ అంశమైతే.. చంద్రబాబు కూడా సంస్కరణలకు పెట్టింది పేరు. పరిశ్రమల స్థాపనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు సామాన్య, పేద, రైతు వర్గాలను మాత్రం పట్టించుకోరన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. విద్యుత్తు నుంచి అన్ని అంశాల్లో సంస్కరణలను కోరుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయనలో రాష్ట్రం అభివృద్ధి కంటే కీర్తికాంక్ష ఎక్కువగా కనపడుతుంది. తన వల్లనే అంతా జరిగిపోయిందన్న భ్రమలో ఆయన ఉండటమే దీనికి కారణం. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత తనకు తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చెప్పుకుంటారు. తరచూ వీడియో సమావేశాలు నిర్వహిస్తూ పద్దెనిమిది గంటల పాటు రోజుకు పనిచేసే సత్తా ఉన్న నేతగా ఆయనకు పేరుంది. అయితే ఆయన హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందో అప్పులు కూడా అదేస్థాయిలో జరిగాయన్నది లెక్కలు చెబుతున్నాయి. ఆర్థిక నిపుణులు సయితం చంద్రబాబు పరిపాలనపై గతంలో అభ్యంతరాలు చెప్పిన సందర్భాలున్నాయి.
పవన్ కల్యాణ్ : జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటుతుంది. అయితే ఇంత వరకూ ఆయన శాసనసభలో కాలుమోపలేదు. అయితే ప్రజలకు సేవ చేయాలన్న తపన అయితే ఉంది. అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా ఉండలేని మనస్తత్వం. 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చి.. ఆ పార్టీలనే 2019 ఎన్నికల్లో వ్యతిరేకించారు. తీవ్రంగా విమర్శించారు. తిరిగి 2024లో అదే పార్టీలతో జతకట్టారు. నిలకడలేని మనస్తత్వం అంటారు. స్థిరత్వం లేని ఆలోచనలు ఆయన సొంతంగా చెప్పాలి. ఎప్పుడు ఏం మాట్లాడతారో? ఆయనకే తెలియదు. రాజకీయ వెండి తెరపై ఇంత వరకూ స్క్రీన్ స్పేస్ దొరకని నేతగా మిగిలిపోయినా బలమైన అభిమానులు ఆయన సొంతం. అదే సమయంలో బలమైన సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆయన పక్కన ఉంటే సంబరపడినంత సేపు పట్టదు.. వ్యతిరేకించడానికి. అదే ఆయనతో భయం. ఏమాత్రం సర్దుకుపోయే మనస్తత్వం కాదంటారు. ఇచ్చిన హామీలను అమలు పర్చాలని ఆయన కోరుకుంటారు. కానీ వాటి సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించరు. ఇలా ముగ్గురు భిన్నమైన వ్యక్తిత్వం.. విభిన్నమైన మనస్తత్వం ఉన్న నేతలు ముగ్గురు కలిశారు. ముగ్గురిపై నమ్మకం లేకపోవడమే అతి పెద్ద మైనస్. మరి ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఎంత మేర విజయం సాధిస్తుందన్నది చూడాల్సి ఉంది.




Tags:    

Similar News