Tue Apr 07 2026 11:03:05 GMT+0530 (India Standard Time)
Amaravathi : అమరావతికి ఊపొచ్చిందా... డెడ్ లైన్ ముగుస్తుండటంతో?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతికి చట్టబద్ధత లభించడం ఒక శుభపరిణామమయితే.. అక్కడ నిర్మాణ పనులు అత్యంత వేగంగా పుంజుకోవడం కూడా అంతే గుడ్ న్యూస్. ఎండాకాలం ముగియక ముందే వీలయినంత మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తున్నారు. మళ్లీ జులై, ఆగస్టు నెలల తర్వాత వానలు ప్రారంభమైతే పనులు జోరుగా సాగవు. అదుకే ఈ నాలుగు నెలలు పనులు వేగంగా చేయాలని ప్రభుత్వం నుంచి కూడా కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ పనులను నిరంతరం సమీక్షిస్తున్నారు.
చంద్రబాబు పనుల పురోగతిపై...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమరావతి పనుల పురోగతిపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు నలభై వేల మంది కార్మికులు పైగానే మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. దీంతో శరవేగంగా అమరావతి నిర్మాణపనులు జరుగుతున్నాయి. గతంలో పనులు నిలిచిపోయిన చోట ఇప్పుడు పదుల సంఖ్యలో భారీ క్రేన్లు, అత్యాధునిక యంత్రాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుండే కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచికూడా వేల సంఖ్యలో కార్మికులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. వీరంతా అమరావతికి ఒక నగరం రూపు తెచ్చేందుకు కష్టపడుతున్నారు. కాంట్రాక్టు సంస్థలు తమకు అప్పగించిన డెడ్ లైన్ లోగా పనిని పూర్తి చేసేందుకు వేగంగా పనులు చేయిస్తున్నారు.
ఊపందుకున్న పనులు...
ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగంగా సీఆర్డీఏ భవనం, జడ్జీల బంగ్లాలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల నివాసాలు దాదాపు పూర్తి కావచ్చాయి. గ్రేడ్-1 ఆఫీసర్లు మరియు ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణం ఊపందుకుంది. గతంలో మూడు అంతస్తుల వరకు ఉన్న నిర్మాణాలు ఇప్పుడు ఆరు అంతస్తులకు చేరుకున్నాయి. రెండు వందల మీటర్ల ఎత్తు వరకు యంత్రాలను అమర్చి, ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా అమరావతిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సుమారు పది అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు మరియు 18 జాతీయ బ్యాంకులు ఇక్కడ తమ పునాది రాళ్లు వేశాయి. క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక కంపెనీలు కూడా తమ పనులను ప్రారంభించాయి.
Next Story

