Fri Dec 05 2025 18:04:40 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అమరావతిపై అసత్య ప్రచారంలో వాస్తవమెంత?.. నిజానిజాలేమిటి?
రాజధాని అమరావతి పరిధిలో ఇటీవల నిలిచిన వర్షపునీరు తగ్గిపోయింది. తిరిగి నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.

రాజధాని అమరావతి పరిధిలో ఇటీవల నిలిచిన వర్షపునీరు తగ్గిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండవీటివాగు, కొట్టేళ్లవాగు నీరు నీరుకొండ, ఐనవొలు, కురగల్లు, శాఖమూరు పరిధిలో నిలిచినపోవడంతో రాజధాని మునిగిపోయిందని అసత్య ప్రచారాలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సయితం ఆరోపించారు. అమరావతి మునగలేదని, మునిగింది వైసీపీ అని కూడా ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రాజధాని అమరావతి లో నిలిచిపోయిన వర్షపు నీరు క్రమంగా తొలగిపోయింది. దీంతో తిరిగి నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన అసత్య ప్రచారాలను తట్టుకుని తిరిగి నిర్మాణాలు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.
ముంపునకు గురవ్వడానికి...
ఉండవల్లి వద్ద పొలాలు కూడా ముంపునకు గురయ్యాయి. అయితే జాతీయ రహదారితోపాటు అంతర్గత రోడ్ల నిర్మాణ సమయంలో వేసిన మట్టికట్టలు నీటి ప్రవహాన్ని అడ్డుకున్నాయి. బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. అందువల్లనే అమరావతి ఎక్కడినీరు అక్కడే నిలిచిపోయింది. అయితే నీరు ఎందుకు నిలిచిపోయిందో గుర్తించే అంశంలో అధికారులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బయటకు వెళ్లే మార్గాన్ని కూడా గుర్తించలేకపోయారు. ఇదే సమయంలో నీటిని బయటకు మళ్లించడంపై వెంటనే మంత్రి నారాయణతో పాటు అధికారులు దృష్టిపెట్టారు. జాతీయ రహదారి దిగువున నీరు వెళ్లేందుకు కాలువ తవ్వడంతో నిలిచిన నీరు వెళ్లిపోయింది.
త్వరలోనే పనులు ప్రారంభం...
నీరు వెళ్లే మార్గాలను మంత్రి నారాయణతోపాటు, సీఆర్డీఏ అధికారులు రెండురోజులపాటు పర్యవేక్షించారు. నీరు తగ్గిపోవడంతో అందరూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుతే సమస్యను గుర్తించి ఉంటే నీరు వేగంగా బయటకు వెళ్లేదని రైతులు చెబుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో అమరావతిలో నీరు నిలిచిందంటున్నారు. అయితే జిఏడి టవర్లలో అక్కడక్కడ పనుల కోసం తవ్విన గుంటల్లోనూ నీరు నిలిచిపోయింది. వాటిని తోడేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మొత్తం సమస్య పరిష్కారం అవుతుందని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. అమరావతి రాజధానిలో నీరు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారం మానుకోవాలని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఇకనైనా మానుకోవాలని సూచిస్తున్నారు.
Next Story

