Sat Dec 13 2025 19:31:11 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అమరావతి నుంచిచూస్తే...?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి ప్రతిష్టాత్మకమైన సంస్థ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, దేశంలోనే అగ్రశ్రేణి విజ్ఞాన కేంద్రంగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఖగోళ పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా అమరావతిలో 'కాస్మోస్ ప్లానెటోరియం' నిర్మాణం కానుంది. ఇది కేవలం ఒక ప్రదర్శనా కేంద్రంగా కాకుండా.. క్వాంటం టెక్నాలజీ, మెటీరియల్స్ సైన్స్ మరియు ఖగోళ శాస్త్రం అనే మూడు కీలకమైన రంగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే 'విజ్ఞాన విప్లవానికి' వేదికగా మార్చేందుకు ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది.
దీని ప్రత్యేకత ఏంటంటే?
ఈ ప్లానెటోరియం యొక్క అతిపెద్ద ప్రత్యేకత, ఇందులో IIA పరిశోధనా డేటా మరియు అత్యాధునిక సాంకేతికతను వినియోగించడం. ఇది సాధారణ డోమ్ ప్రొజెక్షన్ సెటప్ కాదు. అత్యాధునిక త్రీడీతో లీనమయ్యే రియల్ టైం సాంకేతికతతో రూపొందించబడుతుంది. అంటే, ఇక్కడకు వచ్చే సందర్శకులు కేవలం తెరపై నక్షత్రాలను చూడకుండా, వాస్తవంగా గెలాక్సీల మధ్య నడుస్తున్నట్లు, నెబ్యులాల గుండా ప్రయాణించిన అనుభూతిని పొందే అవకాశం దక్కుతుంది. ఇక్కడి కంటెంట్ IIA శాస్త్రవేత్తలు సేకరించిన అత్యంత కచ్చితమైన, ప్రపంచ స్థాయి పరిశోధనా డేటా ఆధారంగా ఉంటుందని చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ సూచన మేరకు అమరావతిలో ఈ సంస్థను ఏర్పాటు చేయనుంది.
మైసూరులోనే ఉన్న...
ఇప్పటి వరకూ మైసూరులో మాత్రమే ఇది ఉంది. ఒకటిన్నర సంవత్సరంలో దీని నిర్మాణ పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులతో పాటు యువకులు ఈ ప్లానెటోరియంను సందర్శించి మంచి అనుభూతిని పొందే అవకాశముంది. దేశంలో మైసూర్ తర్వాత అమరావతిలోనే దీనిని ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌పై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతుంది. IIA భాగస్వామ్యం వలన, అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా, ఖగోళ, భౌతిక మరియు మెటీరియల్స్ సైన్స్ లో ఉన్నత స్థాయి పరిశోధనా కార్యకలాపాలకు ఒక కేంద్రంగా మారుతుంది. ఈ అత్యాధునిక కేంద్రం యువ విద్యార్థులలోసైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమెటిక్స్ రంగాలపై అపారమైన ఆసక్తిని కలిగిస్తుంది. యువత, విద్యార్థులు ఎక్కువ మంది సైన్స్ పట్ల ఆకర్షితులవ్వడానికి దోహదపడుతుంది.
Next Story

