Fri Dec 05 2025 15:00:41 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : రాజధాని అమరావతికి కొత్త సమస్య.. మధ్యలో ఉన్న భూమి ఏం చేయాలి?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కొత్త సమస్య తలెత్తింది.

అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త సమస్య తలెత్తింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించారు. అందులో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ముప్ఫయి రెండు వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన రైతులకు కమర్షియల్, నివాసయోగ్యమైన స్థలాలను ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పింది. రాజధాని నిర్మాణం పూర్తయితే వాటి ధర పెరుగుతుందని చెప్పింది. ఈ మేరకు రైతులు స్వచ్ఛందంగా ముందకు వచ్చి తమ పొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోలేదు.
మధ్యలో ఉన్న...
ఇక మరోసారి 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి రాజధాని అమరావతి నిర్మాణపనులు వేగం పుంజుకున్నాయి. అయితే అమరావతి రాజధాని నిర్మాణం చుట్టూ మరోసారి భూసేకరణ సమస్య తెరమీదకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం 32వేల ఎకరాలను సమీకరించినప్పటికీ, వాటి మధ్యలో ఉన్న పద్దెనిమి వందల ఎకరాలు ఇప్పుడు చర్చను లేపుతున్నాయి. పద్దెనిమిది వందల ఎకరాలను భూములు ఉన్న 80 మంది రైతులు ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు అప్పగించేందుకు సిద్ధపడలేదు. ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడు నేరుగా భూసేకరణ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
భూములు ఇవ్వని రైతులు...
అయితే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇవ్వని రైతుల వాదన వేరే విధంగా ఉంది. తమకు ఈ భూమితో అనుబంధం కొన్ని దశాబ్దాలుగా ఉందని, తమకు ఇచ్చే పరిహారం సరిపోదని మరికొందరు ల్యాండ్ పూలింగ్ కు అంగీకరించడం లేదు. గత ఐదేళ్లు అమరావతి పనులు నిలిచిపోవడం వల్ల తమ కుటుంబాలు ఇబ్బందిపడేవని, భూములు ఇచ్చిన రైతులు భూములు అమ్ముకోలేక, ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారంటున్నారు. అయితే మధ్యలో ఉన్న ఆ పద్దెనిమిది వందల ఎకరాలను తీసుకోగలిగితేనే ప్రబుత్వం మౌలిక వసతుల కల్పనక వేగం పెంచనుంది. మధ్యలో భూములు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే సీఆర్డీఏ అధికారుల భూ సేకరణ చేయాలని నిర్ణయించారు.
భూ సేకరణకు దిగితే...
భూ సేకరణకు దిగితే రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. అందుకే ఎనభై మంది రైతులను ముందుగా ఒప్పించి, మెప్పించి వారిని ల్యాండ్ పూలింగ్ కు అనుకూలంగా మలచాలని తొలుత నిర్ణయించుకున్నారు. బలవంతపు సమీకరణ చేస్తే రైతులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మెలిక పడి ఆ వివాదం ఎన్ని ఏళ్లు కొనసాగుతుందన్నది తెలియదు. అందుకే నయానా, భయానా వారిని ఒప్పించేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా రంగంలోకి దిగారు. మరి చివరకు ఎనభై మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కు అంగీకరిస్తారా? లేక భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? అన్నది చూడాల్సి ఉంది. ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

