Sat Mar 28 2026 12:12:45 GMT+0530 (India Standard Time)
Amaravathi : నేడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం... అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం నేడు జరగనుంది

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం నేడు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఈ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు అవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంటూ ఏమీ లేదు. 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెచ్చింది. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో పనులను వేగవంతం చేసింది.
దానికంటే భిన్నమైనదని...
ప్రస్తుతం అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్య గతంలోని మూడు రాజధానుల బిల్లు కంటే భిన్నమైనదని అంటున్నారు. అందుకే ఈ ప్రక్రియలో నిబంధనలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం కేవలం ఒక రాష్ట్ర బిల్లు మాత్రమే కాదు, ఇది ప్రధానంగా ఒక అసెంబ్లీ తీర్మానం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేలా కేంద్ర చట్టంలో సవరణ తీసుకురావాలని, అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించనుంది.
శాసన మండలి పాత్ర...
సాధారణంగా ఒక 'బిల్లు' చట్టం కావాలంటే అసెంబ్లీ మరియు మండలి రెండింటి ఆమోదం అవసరం. కానీ ఒక తీర్మానం అనేది ఆ సభ యొక్క అభిప్రాయ ప్రకటన మాత్రమే. దీని ప్రధాన లక్ష్యం కేంద్ర పార్లమెంటులో సవరణ ప్రక్రియను ప్రారంభించడం కాబట్టి, అసెంబ్లీ తీర్మానం ప్రాథమిక అవసరంగా ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ని సవరించడం ద్వారా, భవిష్యత్తులో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతి హోదాను సులభంగా మార్చలేని విధంగా ఒక బలమైన న్యాయపరమైన అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి రైతులు కూడా గత కొంతకాలం నుంచి ఇదే కోరుతున్నారు. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభిస్తే చాలా వరకూ రైతులు ఊరట చెందే అవకాశముంది.
Next Story

