Sat Feb 14 2026 15:37:57 GMT+0530 (India Standard Time)
లోకేశ్ అభిమాన ఆహ్వానం..ఆత్మీయ ఆతిథ్యం
నారా లోకేశ్ కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు నిర్వహించారు

మంత్రి నారా లోకేశ్ చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు నిర్వహించారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులను ఆహ్వానించి, ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటు అనే సరికొత్త సంప్రదాయాన్ని ఆరంభించారు. ఉండవల్లి నివాసం ఆవరణలో శుక్రవారం రాత్రి చిత్తూరు, అనకాపల్లి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు విందు ఇచ్చారు.కుటుంబసభ్యులతో వచ్చిన ప్రజాప్రతినిధులకు ఎదురేగి మరీ నారా లోకేశ్ స్వాగతం పలికారు. కుటుంబసభ్యులను పరిచయం చేసుకున్నారు.
సరదా సంభాషణలతో...
అంతా ఒకేచోట కూర్చుని సరదా సంభాషణలతో గడిపారు. స్పీకర్, మంత్రులు, ఎంపీ,ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా కుటుంబసభ్యుల్లా అంతా కలిసి ఒక పిక్నిక్ లా ఆత్మీయ విందులో ఆనందంగా గడిపారు. వివిధ సమస్యలు, ప్రగతి పనులకు సంబంధించి తనకు ఇచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో ఒక నివేదిక తయారుచేసి ఆయా ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ స్వయంగా అందించారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు కానుకగా అందించారు. ఆత్మీయవిందు పూర్తయ్యాక మంత్రి నారా లోకేష్ అతిథులందరినీ గేటు వరకూ వెళ్లి సాగనంపారు. ఈ ఆత్మీయ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గాలి భాను ప్రకాశ్ (నగరి), వీఎం థామస్ (జిడి నెల్లూరు), గురజాల జగన్ మోహన్ (చిత్తూరు), కె మురళీమోహన్ (పూతలపట్టు), పులివర్తి వెంకట మణిప్రసాద్ (చంద్రగిరి), ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (కుప్పం), ఎంపీ సీఎం రమేష్ (అనకాపల్లి -బీజేపీ), ఎమ్మెల్యేలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), హోం మంత్రి వంగలపూడి అనిత (పాయకరావుపేట) బండారు సత్యనారాయణ మూర్తి (మాడుగుల), కేఎస్ఎన్ఎస్ రాజు (చోడవరం), కొణతాల రామక్రిష్ణ (అనకాపల్లి - జనసేన), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి - జనసేన), సుందరపు విజయ్ కుమార్ (ఎలమంచిలి -జనసేన) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.
Next Story

