Sat Dec 13 2025 22:34:18 GMT+0000 (Coordinated Universal Time)
Ap Cabinet Meeting : మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కల్పించనున్న విశాఖ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డ్రోన్ మ్యాన్యుఫాక్చరింగ్ ప్రత్యేక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి మరో 7,500 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. లక్ష కోట్ల పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ లో అనుభవం ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. టీడీ ఇళ్లపై ఇంజినీరింగ్ అధికారుల నివేదికను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
మౌలిక సదుపాయాల కల్పనకు...
దీంతో పాటు భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు పదిహేను వందల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. క్వాంటమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నైబర్ హుడ్ వర్క్ ప్లేస్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పేదలందరికీ గృహసదుపాయాన్ని కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని అభిప్రాయపడింది. నివాస స్థలం లేని అర్హులైన పేదప్రజలందరికీ పక్కా ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
రెవెన్యూ సమస్యలపై...
అలాగే రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం జరగకుండా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని మంత్రులను కోరారు. వెంటనే సమస్యలను పరిష్కారం అయ్యేందుకు మంత్రులు సరైన విధానాన్ని అవలంబించాలని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పుట్టపర్తిని ఆధ్మాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్న చంద్రబాబు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పులు చేస్తుంటే వారిని సరైన దారిలో పెట్టేందుకు ఇన్ ఛార్జి మంత్రులే చొరవ తీసుకోవాలని అన్నారు. నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మొత్తం 69 అంశాల అజెండాపై చర్చించి వాటిని ఆమోదించారు.మంత్రి వర్గ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు తుపాను సమయంలో మంత్రులు తీసుకున్న చొరవను అభినందించారు.
Next Story

