Fri Jan 09 2026 23:00:28 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ పట్టు వీడరా.. ఒకసారి తెలిసి వచ్చినా తెలిసి రాలేదా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని విషయంలో తన స్టాండ్ ను మార్చుకోనట్లే కనపడుతుంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని విషయంలో తన స్టాండ్ ను మార్చుకోనట్లే కనపడుతుంది. మూడు రాజధానులంటూ గతంలో అధికారంలోకి రాగానే ప్రతిపాదన చేసిన జగన్ తనకు ఓట్లు పుష్కలంగా తెచ్చిపెడుతుందని ఆశించారు. మూడు ప్రాంతాల ఓటర్లు తమకు గంపగుత్తగా ఓటేస్తారని నమ్మారు. అందుకే అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ మూడు ప్రాంతాల ప్రజలను తమకు అనుకూలంగా మలచుకోవాల్సిన జగన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో ఇటు కోస్తాంధ్ర, అటు రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ సీట్లు రాలేదు. కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.
పాతపాటే పాడి...
2024లో ఓటమి చెందిన తర్వాత పార్టీ నేతల వాయిస్ మారిందని అనిపించింది. కానీ జగన్ తాజాగా రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలను విన్నవారికి నిర్ణయం లో మార్పులేదనే అనిపిస్తుంది. గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఉండాలని పాత పాటే పాడారు. అంటే అమరావతిని జగన్ ఒప్పుకోవడం లేదన్నది మరొకసారి అర్థమయింది. . విజయవాడ, గుంటూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతి ఉందని ,రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని జగన్ అనడం కూడా అమరావతికి వ్యతిరేకంగానే భావించాల్సి వస్తుంది. నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడం సరికాదని, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పనిచేస్తే అదే రాజధాని అవుతుందని వైఎస్ జగన్ అనడం మరోసారి అధికారంలోకి వచ్చినా ఆయన స్టాండ్ మార్చుకోరని స్పష్టంగా అర్థమవుతుంది.
వైసీపీలోనే భిన్న స్వరాలు...
దీనిపై వైసీపీలోనే భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. రాజధాని అమరావతికి మొన్నటి ఎన్నికల్లో అన్ని ప్రాంతాల వాసులూ జై కొట్టినప్పటికీ మళ్లీ మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నాడో తమకు అర్థం కావడం లేదని కొందరు కోస్తా ప్రాంత వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం జగన్ అన్నదానిలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ, గుంటూరు అభివృద్ధిని వదిలేసి ఏమీ లేని చోట లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టడాన్ని మాత్రమే జగన్ ప్రశ్నించారంటున్నారు. మొత్తం మీద జగన్ అమరావతి రాజధానిగా ఉండటం మాత్రం జగన్ కు ఇష్టం లేదనే అనిపిస్తుంది. మరి జనం ఏరకంగా స్పందిస్తారన్నది మూడేళ్ల తర్వాత ఎన్నికలప్పుడే తేలుతుంది.
Next Story

