Sat Dec 13 2025 19:30:30 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అపూర్వ ఘట్టానికి నేడు ముహూర్తం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవీ రాజధాని అమరావతిలో తమ భవనాలు నిర్మించుకోవడం కానీ, కార్యకలాపాలు మొదలుపెట్టడం కానీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పడి దాదాపు పదేళ్లు గడుస్తున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించింది. అయినా వాటి నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదు. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు రావడంతో ఆ ఊసే లేకుండా పోయింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలకు...
ఇక మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రధాని మోదీ వచ్చి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంతో పనులు వేగం అందుకున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలు తమ కార్యకలాపాలను సాగించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో పాటు రైలు సౌకర్యంతో పాటు మౌలిక వసతులను కూడా సమకూరుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు వివిధ బ్యాంకులకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం ఏర్పడింది. ఈ మేరకు నేడు శంకుస్థాపనలు జరగనున్నాయి.
ఒకే సారి ఇరవై ఐదు బ్యాంకులు...
ఈరోజు ఇరవై ఐదు బ్యాంకులకు సంబంధించిన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. ఒకేసారి ఇరవై ఐదు బ్యాంకులను ప్రారంభించనున్నారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంతో పాటు ఎస్.బి.ఐ, కెనరా, యూనియన్ వంటి అన్ని రకాల బ్యాంకులకు సంబంధించిన భవనాలకు ప్రభుత్వం భూములను కేటాయించింది. ఈ ప్రాంతాన్ని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ గా అభివృద్ధి చేసే విధంగా ఈ కార్యక్రమం తర్వాత ఊపందుకోన్నాయి. ఈ ఇరవై ఐదు బ్యాంకులు 1,328 కోట్ల రూపాయల పెట్టుబడితో భవనాలను నిర్మించనున్నారు. ఈ బ్యాంకుల ఏర్పాటుతో కొత్తగా 6,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Next Story

