Fri Dec 05 2025 16:10:09 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : విజయవాడలో డయేరియాతో ఆసుపత్రి పాలు.. కారణం ఏంటంటే?
విజయవాడలో డయేరియా కలకలం రేపుతుంది. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రబలి అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు

విజయవాడలో డయేరియా కలకలం రేపుతుంది. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రబలి అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకూ దాదాపు ముప్ఫయి మందికి పైగానే డయేరియా బారిన పడినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. వారంతా ఆసుపత్రుల్లో చకికిత్స పొందుతున్నారు. అయితే డయేరియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారిలో దాదాపు ఐదుగురి ఆరోగ్యం మెరుగుపడటంతో వారిని డిశ్చార్జి చేశారు. మిగిలిన వారంతా డయేరియాతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కారణాలు మాత్రం..
అయితే డయేరియా వ్యాధి ప్రబలడానికి గల కారణాలను మాత్రం ఇంకా బయటకు రాలేదు. కలుషిత నీటిని తాగినందున డయేరియా వ్యాప్తి చెందిందనిస్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు అంగీకరించడంలేదు. తాము అక్కడ నీటిని పరీక్షలకు పంపామని, ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. అయితే న్యూ రాజరాజేశ్వరిపేటలో కలుషిత నీరు మాత్రం వల్ల డయేరియా వ్యాధి ప్రబలలేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఆహారమా? కలుషిత నీరా?
కలుషిత నీటి వల్ల కాకపోతే కలుషిత ఆహారం వల్ల ఏదైనా ఈ వ్యాధి ప్రబలిందా? అన్న కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక ఫంక్షన్ లో తిన్న ఆహారం వల్లనే డయేరియా వ్యాప్తి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. అయితే తమ ప్రాంతంలో కొన్ని రోజులుగా తాగునీరు రంగుమారిందని, ఎర్ర రంగులో నీరు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు అదే రంగులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విజయవాడ ప్రజలు తాగునీటిని వేడి చేసి చల్లార్చి వాడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో హెల్త్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారుల బృందాలు డయేరియా ప్రబలడంపై విచారణ చేయనున్నారు.
Next Story

