Fri Dec 05 2025 11:16:32 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : విజయవాడను బెంబేలెత్తిస్తున్న డయేరియా.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
విజయవాడలో డయేరియా కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి

విజయవాడలో డయేరియా కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకూ 115 మంది వరకూ డయేరియా తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. వైద్య శిబిరంలో దాదాపు అరవై మంది వరకూ చికిత్స పొందుతున్నారు. దాదాపు యాభై మంది కోలుకుని తమ ఇంటికి వెళ్లారు.
నమూనాలను సేకరించి...
ఇంత భారీ సంఖ్యలో డయేరియా వ్యాధిన బారిన పడటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. నిన్నటి వరకూ గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాలు తిని ఈ వ్యాధిన పడ్డారని భావించారు. కానీ కలుషిత నీటిని తాగడం వల్లనే తమకు ఈ వ్యాధి వచ్చిందని రోగులు చెబుతున్నారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. ఎక్కడైనా మంచినీటి పంపులో డ్రైనేజీ నీరు కలుస్తుందేమోనని భావించి ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నారు. నీళ్లు రంగు మారడంతోనే తమకు ఈ వ్యాధి వచ్చిందని వారు అంటుండటంతో వారి అనుమానాలను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.
అన్ని రకాల చర్యలు...
ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. రోగుల మూత్రం, రక్తం, మల నమూనాలను కూడా ల్యబ్ కు పంపారు. వీటికి సంబంధించిన పరీక్షలు రావాల్సి ఉంది. అలాగే స్థానికంగా మాంసం, ఆహారం విక్రయిస్తున్న దుకాణాలను కూడా తనిఖీలు చేశారు. కొన్ని దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వందల సంఖ్యలో డయేరియా వ్యాధి ప్రబలడంతో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తు్న్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను రంగంలోకి దించారు. మంచినీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగాలంటూ సూచిస్తున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
Next Story

