Tue Dec 23 2025 06:22:00 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అమరావతి భారంగా మారనుందా? పెరుగుతున్న అప్పులు.. ఎలా తీరతాయో?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతన్నాయి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతన్నాయి. అయితే రాజధాని నిర్మాణ పనుల విషయంలో అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల సవరించిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ అమోదించిన, చేపట్టవలసిన పనులకు సుమారు తొంభయి వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ మొత్తంతో అమరావతిలో 110 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వీటిల్లో చాలా వరకూ పరిపాలనా పరమైన అనుమతులు వచ్చాయి. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ప్రాజెక్టుల విలువలూ పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో పేర్కొన్న మాస్టర్ ప్లానులో ఉన్న రోడ్లకు కొన్ని చోట్ల ఇబ్బందులు లేకుండా నాలుగు చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించారు. దీనిలోనూ ప్రభుత్వ కోర్ ఏరియా ఉండే ప్రాంతంలో రవాణా అడ్డంకులు లేకుండా నాలుగు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
అనేక ప్రాజెక్టుల ఆమోదంతో...
అవసరాన్ని బట్టి వీటి సంఖ్య పెరగొచ్చు. మొత్తం ప్రాజెక్టుల్లో యాభై వేల కోట్ల విలువైన 90 ప్రాజెక్టులకు టెండర్లకు ఆమోదం ఇచ్చారు. వీటిల్లోనూ నలభై తొమ్మిది వేల కోట్ల విలువైన 78 ప్రాజెక్టు పనులను అప్పగించేశారు. రాజధాని పరిధిలో గృహ నిర్మాణం, భవనాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద ముంపు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్లాట్ల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు. వీటన్నిటికీ కలిపి 110 ప్రాజెక్టులుగా పనులు నిర్వహించనున్నారు. వీటిల్లోనూ సుమారు 36 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి. వాటికి డీపీఆర్ లు కూడా సిద్ధం చేశారు. అయితే రాజధాని నిర్మాణానికి రూ.64 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని 2024లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
అనేక మార్పులతో...
ఇటీవల జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో అంచనాలు 80 వేల కోట్లకు పెరిగాయనీ తెలిపారు. ఇప్పుడు మరలా 91 వేల కోట్ల విలువైన పనులను ప్రతిపాదించారు. అమరావతిలో భవిష్యత్లో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది అనేది లేకుండా ఉండేందుకు వీలుగా అవసరమైన చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో జంక్షన్లు ప్రతిపాదించారని, వాటిని ఎలివేటెడ్ కారిడార్లుగా మారుస్తున్నామని తెలిపారు. డీపీఆర్ సిద్ధం చేశామని చెబుతున్నారు. అంతర్గతంగా నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ తోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డును మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలిపేందుకు సీతానగరం నుండి మణిపాల్ వరకూ మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇలా అంచనాలు పెరిగాయని స్పష్టం చేస్తున్నారు
పెరుగుతున్న అప్పులు...
అమరావతిలో పెరుగుతున్న అంచనాలతోపాటు అప్పులూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఖర్చు చేస్తున్న ప్రతిరూపాయి అప్పు రూపంలో తెచ్చిందే. ఎడిబి, వరల్డ్ బ్యాంకు రూ.15 వేల కోట్లతోపాటు హడ్కో, బ్యాంకుల కన్సార్టియం వంటివి మరో రూ.15 వేల కోట్లు, ఇతర రూపాల్లో మరో రూ.7 వేల కోట్లు ఇలా మొత్తం అప్పు రూపంలోనే తీసుకువస్తున్నారు. అప్పుతీర్చే అంశంపైనా వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టు తో చేసుకున్న ఒప్పందంలోనూ అమరావతి నగరం నుండి వచ్చే ఆదాయంతో చెల్లిస్తామని అంగీకరించారు. తీసుకున్న అప్పు పెరుగుతుంటే ఇంకా కొత్త అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అప్పులు పెరుగుతుండటంతో అమరావతి నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తయి.. ఎప్పుడు అప్పులు తీరతాయన్న ఆందోళన మాత్రం అందరిలోనూ ఉంది.
Next Story

