Sat Dec 13 2025 22:43:23 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : రాజధాని అమరావతి రైతులను పట్టించుకునేదెవరు?
పాలకులు మారినా.. రాజధాని రైతుల తలరాతలు మాత్రం మారలేదు.

పాలకులు మారినా.. రాజధాని రైతుల తలరాతలు మాత్రం మారలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఉద్యమాలు చేసిన రాజధాని రైతులు నేడు కూడా ఆందోళనకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నేడు సీఆర్డీఏ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుంది. ఇటు మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదు. అటు అధికారులు వీరి సమస్యలపై దృష్టి సారించడం లేదు. చంద్రబాబును కలిసేందుకు అవకాశం లేదు. ఇలా రాజధాని రైతులు తిరిగి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తమ గోడు వినాలంటూ మీడియాకు ఎక్కుతుండటం కూడా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రైతులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు విననున్నారు.
ఏమీ ఆలోచన లేకుండా...
చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపు ఇవ్వగానే .. ఏమీ ఆలోచించకుండా మూడు పంటలు పండే భూములను రాజధాని అమరావతి కోసం ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లవుతున్నా వారి సమస్యలను ఏమాత్రం పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా ఎకరం, రెండు ఎకరాలు ఇచ్చిన రైతులను సీఆర్డీఏ అధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ ఆ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. చివరకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమించిన జేఏసీ నేతలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. తమకు ప్లాట్లు కేటాయించడంపై కూడా ఇంకా వీలుకాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నది వారి ఆరోపణ.
కాళ్లరిగేలా తిరుగుతున్నా...
రాజధాని రైతులు, ప్రజలు మళ్లీ ఆందోళనకు సిద్ధపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి గుంటూరు ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో పాటు నారాయణను కూడా అందులో చేర్చారు. కానీ వారు వచ్చి కూడా తమ సమస్యలను పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆడంగల్ కోసం కూడా ఏడాదిన్నర నుంచి సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వారు అంటున్నారు. అనేక కార్పొరేట్ సంస్థలకు భూములిస్తున్న ప్రభుత్వం తమకు ఎందుకు ప్లాట్లు కేటాయించడం లేదని, అదేమంటే ఏదో ఒక కారణం చూపి కొర్రీలు వేస్తున్నారని అంటున్నారు. రాజధాని రైతులు, కూలీలు, ప్రజల ఇచ్చిన హామీలను నెరవేర్చటంపై ముఖ్యమంత్రి సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నేటి సమావేశంలో చంద్రబాబు రైతులకు అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Next Story

