Fri Dec 05 2025 12:36:44 GMT+0000 (Coordinated Universal Time)
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. టమాటా రైతుల్లో ఆనందం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లి ధర పతనమయింది. టమాటా మాత్రం ధర మండిపోతుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లి ధర పతనమయింది. టమాటా మాత్రం ధర మండిపోతుంది. నిన్న మొన్నటి వరకూ కిలో ఉల్లి ధర యాభై రూపాయలకు పైగానే విక్రయించిన వ్యాపారులు నేడు ఇరవై నుంచి పదిహేను రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో ఉల్లి రైతులు లబోదిబోమంటుండగా, అధిక ధర టమాటాపలుకుతుండటంతో రైతులు ఆనంద పడుతున్నారు. ఉల్లి ధర తగ్గడానికి కారణాలు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున దిగుమతి కావడమేనంటున్నారు. ఉల్లి ధర గత కొంతకాలంగా నిలకడగా కొనసాగుతుండటంతో ఎక్కువ మంది రైతులు ఉల్లి ధరను సాగు చేశారు. దీంతో పాటు మహారాష్ట్ర వంటి చోట నుంచి దిగుమతులు అధికం కావడంతో సప్లయ్ పెరిగి ధర తగ్గిందంటున్నారు.
పడిపోయిన ఉల్లిధర...
కర్నూలు జిల్లా మార్కెట్ ఉల్లి దిగుబడిలో ప్రధమస్థానంలో ఉంటుంది. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర గణనీయంగా తగ్గింది. తక్కువ ఉల్లి మార్కెట్ యార్డుకు వచ్చినప్పటికీ ధరలు తగినట్లుగా లభించడం లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా కావడమేనంటున్నారు. హైదరాబాద్ మార్కెట్ కు మహారాష్ట్ర నుంచి ఎక్కువ క్వింటాళ్లు ఉల్లి దిగుబడి అవుతుంది. ప్రస్తుతం ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటాల్ కు కేవలం 1,100 రూపాయలు మాత్రమే లభించింది. కనిష్టంగా 500 రూపాయలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. బయట మార్కెట్ లోనూ కిలో ఉల్లి ధర ఇరవై నుంచి పదిహేను రూపాయలకు పడిపోయింది.
భారీగా పెరిగిన టమాటా ధర...
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర భారీగా పెరిగింది. నిన్న మొన్నటి వరకూ ఇరవై రూపాయలకు బయట మార్కెట్ లో లభించిన కిలో టమాటా నేడు యాభై నుంచి అరవై రూపాయలకు పలుకుతుంది. భారీ వర్షాల కారణంగా టమాటా దిగుబడి తగ్గడం వల్లనే ధర విపరీతంగా పెరిగిందని అంటున్నారు. మదనపల్లి టమాటా మార్కెట్ కు కూడా తక్కువ టమాటా వస్తుండటంతో వచ్చిన టమాటాను వచ్చినట్లే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు సాగు పూర్తయ్యే దశలో ఉన్న టమాటా దిగుబడి వస్తే మాత్రం కొంత ధర తగ్గే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం టమాటా ధర చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
Next Story

