Fri Dec 05 2025 14:14:54 GMT+0000 (Coordinated Universal Time)
రొయ్యల ధర ఇంతగా పతనమయిందా? ప్రభుత్వాలు పట్టించుకోవా?
ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల పెంపకం దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇన్నాళ్లు కాసుల వర్షం కురిపించిన రొయ్యల పెంపకం నేడు కన్నీరు తెప్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల పెంపకం దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంతో పాటు మరొక వైపు రొయ్యల పెంపకం ఖర్చులు విపరీతంగా పెరిగి పోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలకు మాత్రం వారి సమస్యలు పట్టడం లేదు. ఎగుమతులు ప్రస్తుతం పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు రొయ్యలపై ఎక్కువ పన్నులు వేసేయడంతో చాలా ఆర్డర్లు రద్దయిపోయాయి. ఈ కారణంగా రాష్ట్రానికి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
అన్ని ధరలు పెరిగి...
రొయ్యల పెంపకంలో వినియోగించే ఫీడో, వినియోగించే మందులు, విద్యుత్తు ఛార్జీలతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. తీరా రొయ్యల పంట చేతికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లభించడం లేదు. గత కొన్ని రోజులుగా ఎగుమతులు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయ్యే రొయ్యలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ అన్ని దేశాలు రొయ్యల ఎగుమతులపై పన్నులు పెంచడంతో దిగుమతులపై ప్రభావం పడింది. దీంతో దేశీయ మార్కెట్ లో రొయ్యలను విక్రయిస్తుండటంతో ధరలు కిందకు పడిపోయాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని...
రొయ్యలు ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడులు తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రొయ్య పిల్లలను సరఫరా చేసే హాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తమ ఉత్పత్తులను తగ్గించుకున్నాయి. రొయ్యల కు డిమాండ్ తగ్గిపోవడంతో ఆ ప్రభావం రవాణా, పోర్టు వంటి వాటిపై కూడా పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని, రొయ్యలకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని, ఫీడ్, మందులు సబ్సిడీ ప్రాతిపదికన అందించాలని కోరుతున్నారు.
Next Story

