Thu Dec 05 2024 16:20:45 GMT+0000 (Coordinated Universal Time)
Symbols : సింబల్స్ కొంపముంచుతాయా? రెండు ఈవీఎంలలో రెండు గుర్తులపై నొక్కుతారా?
ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలూ మూడు వేర్వేరు గుర్తులపై పోటీ చేస్తున్నాయి. ఇది గందరగోళానికి దారి తీసే అవకాశముంది
కూటమి ఏర్పాటు చేయడం అంటే చేశారు. కష్టపడి మూడు పార్టీలు కలిశాయి. కానీ మూడు పార్టీలూ మూడు వేర్వేరు గుర్తులపై పోటీ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురయ్యే అవకాశాలున్నాయి. గుర్తులు ఓటర్లను ఇబ్బంది పెట్టే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మూడు పార్టీలూ మూడు గుర్తులు.. జనంలోకి గుర్తును బాగానే తీసుకు పోయినా పోలింగ్ వరకూ వచ్చేసరికి ఓటరు దేనిపై వేయాలన్న దానిపై కొంత గందరగోళానికి గురవుతారన్న టెన్షన్ అభ్యర్థుల్లో ఉంది. ఎందుకంటే మూడు పార్టీల అభ్యర్థులకు మూడు గుర్తులను ఎన్నికల కమిషన్ కేటాయించనుంది.
మూడు పార్టీలు కలసి...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి ప్రచారాన్ని పెద్దగా నిర్వహించడం లేదు. బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లోనూ, ఆరు పార్లమెంటు నియోజకర్గాల్లో పోటీ చేస్తుంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కాగా జనసేన గుర్తు గాజు గ్లాస్. అలాగే బీజేపీ పోటీ చేసే స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి గుర్తు కమలం ఉండనుంది. అంటే మూడు గుర్తులను ఓటరు గుర్తుంచుకోవాలి. ఏపీలో రెండు ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేతేదీన ఎన్నికలు జరుగుతుండటంతోనే ఇప్పుడు అసలు సమస్య తలెత్తింది.
రెండు ఈవీఎంలు...
పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలు ఉంటాయి. ఒకటి పార్లమెంటు నియోజకవర్గానికి చెందింది కాగా, రెండోది అసెంబ్లీ స్థానానికి సంబంధించింది. అంటే రెండు ఈవీఎంలలో రెండు గుర్తులపై ఓటరు బటన్ నొక్కాల్సి ఉంటుంది. కూటమి ఏర్పాటు కావడంతో సీట్లను సర్దుబాటు చేసుకుని పోటీకి దిగడంతో ఇప్పుడు కూటమి అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఒకే వ్యక్తి చాలా చోట్ల రెండు గుర్తులపై ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకే గుర్తు రెండు ఈవీఎంలపై అయితే పరవాలేదు. కానీ సీట్ల సర్దుబాటు జరిగిన చోట ఎంపీ అభ్యర్థికి ఒక గుర్తు మీద, ఎమ్మెల్యే అభ్యర్థికి మరొక గుర్తు మీద బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమైన పనే.
గందరగోళమేనా?
అందుకే ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందన్న అంచనాలు వినిపడుతున్నాయి. తమకు తెలియకుండానే ఓట్లు ఇన్వాలిడ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న భయం అభ్యర్థుల్లో నెలకొంది. అందుకే ఓటర్ల వద్దకు గుర్తును ఈ కూటమిలోని మూడు పార్టీలు బలంగా తీసుకెళుతున్నారు. ఒకవేళ గాజుగ్లాస్ ను ఫ్రీ సింబల్ ను చేస్తే మాత్రం మరింత క్లిష్టతరమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు వచ్చే అవకాశముంది కాబట్టి అప్పుడు మరీ గందరగోళానికి దారితీస్తుందన్న బెదురు మాత్రం కూటమి అభ్యర్థుల్లో కనిపిస్తుంది. అందుకే ఎవరికి వారు తమ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story