శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది
చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది
ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి
తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ఇక కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని వివరించారు
40 రోజుల ప్రయాణం అనంతరం ఈ చంద్రయాన్-3 లోని ల్యాండర్ జాబిల్లిపై దిగనుంది.. ప్రస్తుతం చంద్రయాన్-3 జాబిల్లి దిశగా వెళుతోంది
ప్రొపల్షన్ మాడ్యూల్ ఆగస్టు 23 లేదా 24వ తేదీ నాటికి చందమామ ఉపరితలంపై ల్యాండవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు
ఇస్రో ప్రయోగాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. సతీశ్ ధావన్ సెంటర్ వద్ద ఉన్న గ్యాలరీ నుంచి ఆ ప్రయోగాన్ని వీక్షించారు
శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా చంద్రయాన్ ప్రయోగాన్ని ప్రారంభించారు. ప్రయోగం ఆశించిన విధంగానే కొనసాగుతోందని ఇస్రో వెల్లడించింది. 613 కోట్లతో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టారు
ఇస్రో శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని అభివర్ణించారు. ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతం చేసే ఘట్టం అని పేర్కొన్నారు