ఇకపై…చలాన్లు కుదరవు….?
నేను భరత్…. సినిమా చూసిన వారు ఈ సీన్ మాత్రం మరిచిపోరు….. తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన మహేష్ బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే అంతకు [more]
నేను భరత్…. సినిమా చూసిన వారు ఈ సీన్ మాత్రం మరిచిపోరు….. తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన మహేష్ బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే అంతకు [more]

నేను భరత్…. సినిమా చూసిన వారు ఈ సీన్ మాత్రం మరిచిపోరు…..
తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన మహేష్ బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే అంతకు ముందు ఆయన ఎదుర్కొన్న ట్రాఫిక్ సమస్యలను క్రమబద్దీకరించాలనుకున్నాడు. ఇందుకోసం అత్యవసరంగా ట్రాఫిక్ అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అదేంటంటే రూ.100 జరిమానాను రూ.వెయ్యికి, వెయ్యి రూపాయలున్న జరిమానాలను రూ. 5వేలకు పెంచేశారు. ఇలా ఐదువేలు… పదివేలు….20వేలు, 30వేలు ఇలా ఇష్టానుసారంగా పెంచేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆలోచించాలని చెప్పినా…..ఇంతకాలం అదేగా చేసిందంటూ మహేష్ సమాధానంతో ఈ సీన్ రక్తికట్టింది.
కానీ అది సినిమా…
ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం సైతం ఆలోచించినట్లుంది. లేక ఈ సినిమా చూసినవాళ్లే ఎవరైనా ఓ ఉచిత సలహా ఇచ్చిండొచ్చు. లేక ప్రధాని నరేంద్రమోదీ అండ్ టీం ‘భరత్ అనే నేను’ సినిమా చూసి ఉంటారని, అందుకే ఇంత ఘోరంగా పెనాల్టీ రేట్లు పెంచేశారని సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. మొత్తం మీద మరోసారి ‘భరత్ అనే నేను’ సినిమాను బాగా వైరల్ చేశారు.
పోలీసులకు డబుల్ జరిమానా….
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన చలానాలను సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని, దీని నిర్ణయం మాత్రం ఆయా రాష్ట్రాలదే నంటూ కేంద్రం ప్రకటించింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు విర్రవీగిపోయారు. రోడ్లపై జరిమానాల ధరలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహనకల్పించారు. కాని ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రోడ్లు సరిగ్గాలేకపోవడం, కిలో మీటర్ల కొద్ది యూ టర్నులు పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ గుంతలు పెట్టి ఈ జరిమానాలు వసూలు చేస్తారానంటూ కన్నెర చేశారు. కొందరు నెటిజన్లు మాత్రం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులపై జోకులు పేల్చారు. కేవలం ప్రజలకేనా ఈ జరిమానాలు…. పోలీసులకు ఉండవా అంటూ ఇంకొందరు ఏకంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా పోలీసులపై వస్తున్న వార్తలను చూసి ఇక హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సిబ్బందిని గట్టిగా హెచ్చరించారు. ప్రజలకు సింగిల్ జరిమానా అయితే పోలీసులకు డబుల్ జరిమానా అంటూ చెప్పడం బట్టి చూస్తే మీకే అర్థమవుతోంది ఈ జరిమానాల బాధ.
జరిమానాలు మా అభిమతం కాదు…..
కేంద్రం తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్టంతో ఫైన్లను భారీగా పెంచేయడంతో వాహనదారులు నిత్యం బెంబేలెత్తిపోతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చలాన్లతో వాత పెట్టేస్తారన్న భయం అందరికీ పట్టుకుంది. అయితే చలాన్లు భారీగా పెంచడం వెనక అసలు విషయాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. జరిమానాలు పెంచాలన్నది తమ అభిమతం కాదన్నారు. ఒకనాటికి ఫైన్లు లేని రోజు రావాలని… అందరూ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు, హెల్మెట్ తో సహా ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని వారికి విధించే అపరాధ రుసుం ఎంత విధించాలనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలకే వదిలేసిందని చెప్పారు. కేంద్రం. ట్రాఫిక్ నిబంధనలపై కొత్తగా తీసుకువచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం కాసింత వెనక్కి తగ్గిందనే చెప్పాలి.
జరిమానాలు తగ్గించాలని…..
మరోవైపు కేంద్రం విధించిన నూతన చలాన్లను తగ్గించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అలా చలాన్లు తగ్గించేందుకు ఇప్పటికే గుజరాత్, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా ఈ జరిమానాలపై ఏ నిర్ణయం తీసుకోలేదు. వాహన చట్టం అమలుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం నో చెప్పాయి. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాలు అమలుపై డోలాయమానంలో ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ దీదీ మాత్రం కొత్త మోటారు వెహికిల్ చట్టాన్ని అమలుచేసే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెనుకంజ వేస్తున్న కేంద్రం……
అన్ని రాష్ట్రాలు…. ప్రజల నుంచి ట్రాఫిక్ జరిమానాలపై వ్యతిరేకత రావడంతో ఇక చేసేదేమీ లేక కేంద్రం వెనుకంజవేస్తోంది. ప్రమాదాలు జరగకుండా మాత్రమే తాము చట్టాన్ని తీసుకువచ్చామని అమలు చేసేది మాత్రం ఆయా రాష్ట్రాల బాధ్యతేనంటూ కొత్తస్వరం వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ప్రకటించిన జరిమానాలను సవరించేందుకు కూడా కేంద్రం న్యాయనిపుణులను సంప్రదిస్తోంది. మొత్తానికి ప్రజల వ్యతిరేకత, ప్రభుత్వాల నిర్ణయాలతో ఎట్టకేలకు కేంద్రం ఓ అడుగు దిగి వచ్చిందనే చెప్పాలి. ఈ క్రెడిట్ అంతా కూడా సోషల్ మీడియా నెటిజన్లదేనని చెప్పక తప్పదు.