కేసీఆర్ వారిద్దరినీ కలుస్తారా? లేదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన ఈరోజు చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. తమిళనాడులోని డీఎంకే అధినేత కరుణానిధితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసీఆర్ కోల్ కత్తా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలసి వచ్చారు. తర్వాత బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించి వచ్చారు.
డీఎంకే అధినేతతో నేడు భేటీ.....
తాజాగా తమిళనాడులో బలమైన పార్టీ డీఎంకే మద్దతు కోసం నేడు చెన్నైకి బయలుదేరి వెళుతున్నారు. డీఎంకే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిని కొన్నేళ్లుగా సమర్థిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా డీఎంకే మద్దతు కూడగట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. ఈరోజు ఉదయం డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశమవుతారు. ఆ తర్వాత డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో చర్చలు జరుపుతారు. స్టాలిన్ నివాసంలోనే భోజనాలు చేస్తారు. ఈరోజు కేసీఆర్ చెన్నైలోనే ఉంటారు.
కమల్, రజనీల మాటేమిటి?
అయితే డీఎంకేతో పాటు కేసీఆర్ ఇంకెవరిని కలుస్తారన్నది తెలియలేదు. రేపు మధ్యాహ్నం వరకూ కేసీఆర్ చెన్నైలోనే ఉంటారు. ఇటీవలే తమిళనాడులో పార్టీ పెట్టిన కమల్ హాసన్, త్వరలో పార్టీ ప్రకటన చేయబోతున్న రజనీకాంత్ లను కలుస్తారా? లేదా? అన్నది తెలియరాలేదు.అయితే వారిద్దరినీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కమల్ హాసన్, రజనీకాంత్ లు రేపు చెన్నైలోనే ఉంటే కేసీఆర్ కలిసేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేసీఆర్ తిరిగి చెన్నై నుంచి రేపు మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.