హస్తినలో సంచలనం : రాహుల్ గాంధీ అరెస్టు

రామ్ మనోహర్ లొోహియా ఆస్పత్రి వద్ద కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఆయనను తిల్ మార్గ్ లోని పోలీసు ఠాణాకు తరలించారు. కేవలం రాహుల్ అరెస్టు మాత్రమే కాదు, ఆస్పత్రి వద్దకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
ఢిల్లీలో మాజీ సైనికుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని ఆరోపిస్తూ ఆయన సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్టుగా పోలీసులు చెప్పారు. మరణించిన సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ రాం మనోహర్ లోహియా ఆస్పత్రి వద్దకు వెళ్లగా బుధవారం ఉదయమే పోలీసులు అడ్డుకుని వెనక్కుపంపేశారు. తిరిగి సాయంత్రం ఆయన మళ్లీ అక్కడకు వచ్చారు. పోలీసులు మాత్రం అనుమతించలేదు. రాహుల్ గాంధీ కూడా వెనుదిరగకపోవడంతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
దీంతో పోలీసులు రాహుల్ ను అరెస్టు చేసి తిలక్ మార్గ్ లోని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శకు వచ్చినా కూడా పోలీసులు అనుమతించలేదు. పెన్షన్ విధానం విషయంలో న్యాయం చేయాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మాజీ సైనికుడి మృతి అంశాన్ని కూడా రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారంటూ భాజపా వర్గాలు విమర్శిస్తున్నాయి.