సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చేదు వార్తే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇది తప్పకుండా చేదు వార్తే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఏమిటో తేల్చాలంటూ సా...గుతున్న పిటిషన్ను నాలుగు వారాల్లోగా విచారించి తేల్చాలని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశించడం.. అనివార్యంగా కింది న్యాయస్థానాలు దాన్ని శిరోధార్యంగా పాటించాల్సిన పరిస్థితి... ఇవి ఆయనకు అంత సానుకూలమైన వార్తలు కావు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర గురించి విచారణ ముందుకు సాగడం.. సహజంగానే ఆయనకు ఇష్టం లేదు.
అందుకే ఏసీబీ కోర్టు ఏసీబీని ఆమేరకు ఆదేశిస్తే.. దాని మీద తాను హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అక్కడితో రిలీఫ్ ఫీలయ్యారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం చంద్రబాబును ఒక పట్టాన వదలిపెట్టలేదు. కేసును అంతటితో విడవకుండా, సుప్రీంను ఆశ్రయించారు. పైగా సుప్రీం న్యాయస్థానం కూడా సత్వరమే తమ నిర్ణయాన్ని చెప్పడం విశేషం. ఇందులో నాలుగు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని సుప్రీం ఆదేశించింది.
అయితే ఈ తీర్పు పర్యవసానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ఏసీబీ ముందు విచారణకు కూర్చోవాల్సి వస్తుందా? లేదా, మరో రకంగా ప్రక్రియ సాగుతుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. ఏది ఎలా సాగినప్పటికీ.. బిడ్డచచ్చినా పురిటివాసన పోలేదన్నట్లుగా.. ఓటుకు నోటు వ్యవహారం జనం మరచిపోయినా.. దానికి సంబంధించిన కేసుల చికాకులు చంద్రబాబును ఇప్పట్లో వదిలేలా లేవు.