శ్రీవారి నగల కోసం కేసీఆర్ ఏం చేశారు?
తిరుమల శ్రీవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమర్పించే ఆభరాణాలు ఎలా ఉంటాయి? ఎంత బరువు కల్గి ఉన్నాయి? ఆభరణాల తయారీలో కేసీఆర్ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు. స్వామివారికి అలంకరించే ఆభరణాలు ఎలా ఉండాలి? వీటన్నింటి గురించే ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తిరుమల వెంకన్నకు ఆభరణాలు సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు. అయితే ఆ మొక్కు తీర్చుకునేందుకు కేసీఆర్ రెండేళ్లు ఎందుకు ఆగారు?
టీటీడీకే బాధ్యత.....
తిరుమల శ్రీవారు ఆభరణాలంటేనే ఎంతో ప్రత్యేకత సంతరించుకుని ఉంటాయి. కోనేటి రాయుడు ధరించే ఆభరణాలకు అంత పవిత్రత ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి వ్యవహరించారు. ఆలయ పవిత్రత దెబ్బతీయకుండా...శ్రీవారి కి ప్రీతిపాత్రంగా నగలు తయారు చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆభాధ్యతను కేసీఆర్ టీటీడీకే అప్పగించారు. శ్రీవారికి సాలిగ్రామ హారంతో పాటు మకరకంఠిని కూడా తయారు చేయించారు. టీటీడీ పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం జరిగేలా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఐదు కోట్ల రూపాయలను కేసీఆర్ ఇచ్చి ఆభరణాల తయారీ బాధ్యతను టీటీడీపైనే పెట్టారు.
కమలం ఆకారంలో సాలిగ్రామ హారం....
టీటీడీ కూడా ఆభరణాల తయారీకి టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లను కోయంబత్తూరు కు చెందిన కీర్తీలాల్ కాళిదాస్ జ్యుయలర్స్ సంస్థ చేజిక్కించుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో, గ్రాము 2,611 ధరతో ఆభరణాలు తయారు చేసేందుకు కీర్తీలాల్ సంస్థ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. కీర్తీలాల్ సంస్థ ఆభరణాలను తయారు చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. సాలిగ్రామ హారం బరువు 14 కిలోల రెండు వందల గ్రాములు. మకరకంఠి హారం బరువు 4 కేజీల 260 గ్రాములు. మకరకంఠి ఐదు పేటలు ఉంటుంది. ఆభరణాల తయారీలో నాణ్యతను పాటించాల్సిందేనని టీటీడీ పెట్టిన షరతులకు కీర్తీలాల్ సంస్థ అంగీకరించింది. ఆభరణాలు తయారు చేయడంతో పాటుగా వాటిని తిరుమలకు చేర్చే బాధ్యత కూడా కీర్తీలాల్ సంస్థదే. దీనికి మొత్తం 4 కోట్ల 93 లక్షల రూపాయలు వ్యయం అయింది. కమలం నమూనాతో సాలిగ్రామ హారం ఉంటుందని చెబుతున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమలను దర్శించుకోనున్నారు. ఈనెల 30 వ తేదీన ఏడుకొండల వారికి ఆభరణాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. తొలుత ఆకాశరాజు శ్రీవారికి కిరీటం చేయించారని చెబుతారు. రాయల వారు కూడా కొన్ని నగలను ఆపద మొక్కులవాడికి సమర్పించుకున్నారట. రాజుల తర్వాత ఒక ప్రభుత్వం అధికారికంగా శ్రీవారికి ఆభరణాలు సమర్పించి అరుదైన గుర్తింపు పొందిందంటున్నారు టీటీడీ అధికారులు.