వైసీపీ పోరాటానికి ఏది క్లారిటీ.....

వ్యూహా రచనలో పార్లమెంట్ పార్టీ విఫలం
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో కూడా ఆ పార్టీ నేతలకు తెలీడం లేదట..... కాస్త సంశయం., ఇంకాస్త సంకోచం., ఏం చేస్తే ఏం ముంచుకొస్తుందోన్న ఆందోళన వెరసి ఏమి చేయకుండానే కాలం గడిపేయడం అలవాటై పోయింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రిపబ్లిక్ డే రోజు విశాఖలో హైడ్రామా నడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంతో ఇంతో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ పదేపదే చెబుతూ వస్తోంది. మరి అలాంటి కీలకమైన రాజకీయ అస్త్రం విషయంలో ఆ పార్టీ ఎంత జాగ్రత్తగా ఉండాలి.... ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తపడాలి. తాము వేసే ప్రతి అడుగు ప్రపంచానికి తెలిసేలా వ్యవహరించాలి. అయితే ఆ పార్టీ నేతల్లో అనుభవ రాహిత్యం కావొచ్చు..., కావాల్సినంత దూకుడుతనం లేకపోవడం కావొచ్చు చాలా సమయాల్లో విలువైన అవకాశాలను చేజార్చుకుంటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగం జరిగింది. రాష్ట్రపతి ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంతో నిరసన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారట. ఆ తర్వాత మధ్యహ్నం 12.30గంటల సమయంలో విజయ్‌చౌక్ వచ్చి రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడాన్ని తప్పు పడుతూ ఎంపీలు సాయిరెడ్డి., మేకపాటి రాజమోహన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎంపీలు నిరసన తెలిపిన విషయం అప్పటికీ మీడియాకు తెలీదు. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి., పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలంటూ ఎంపీలు గట్టిగా డిమాండ్ చేసి వెళ్లిపోయారట.... ఆ తర్వాత తీరిగ్గా మధ్యహ్నం 3.30-4గంటలకు వాకౌట్ చేసిన విషయాన్ని బయటపెట్టారట. రాష్ట్ర ప్రజలు మొత్తం ఆసక్తిగా చూస్తోన్న విషయంలో వైసీపీ నేతల వ్యవహార శైలి చాలా సందర్భాల్లో గందరగోళంగానే ఉంటోందట.
ప్రైవేట్ బిల్లుది అది తీరు....?
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభ కేవీపీ రామచంద్రరావు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కొద్దిపాటి చర్చ జరిగినా ద్రవ్య బిల్లు రాజ్యసభలో చర్చించడానికి లేదంటూ అధికార పక్షం కేవీపీకి చెక్ పెట్టేసింది. అంతకుముందు ట్రాన్స్‌జెండర్స్ హక్కుల విషయంలో పెట్టిన బిల్లు నెగ్గడంతో రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేవీపీ ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యసభలో మనీబిల్లుకు అవకావం లేదని తేల్చేయగానే వైఎస్సార్సీపీ రంగంలోకి దిగింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. నిజానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉంది. ఎవరి మద్దతు లేకుండానే బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే స్థాయిలోఉంది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ప్రవేవపెట్టిన బిల్లు కూడా కేవీపీకి అనుకరణే తప్ప సొంత స్ట్రాటజీ కాదని చెబుతున్నారు. లోక్‌సభలో వైవీ సుబ్బారెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించే అవకాశం దక్కుతుందో లేదోనన్న సందేహాలు కూడా ఉన్నాయి.